Heavy Flood Flow To Jurala Project :జూరాల ప్రాజెక్టుకు భారీ వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 46 గేట్లు ఎత్తి దిగువన శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 2లక్షల 19వేల 722 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, గేట్ల ద్వారా లక్షా 93వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అదే విధంగా జల విద్యుత్ ద్వారా 23,668 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.401టీఎంసీలు ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 316.800 మీటర్లు ఉంది. నిర్విరామంగా కురుస్తున్న వర్షాల కారణంగా రాబోయే రెండు రోజుల్లో వరద ప్రవాహం పెరగవచ్చని, నది పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Govt Delay in Jurala Tourism Works :కర్ణాటక నుంచి తెలంగాణలోకి ప్రవేశించే కృష్ణానది ప్రవాహానికి అడ్డుకట్ట వేసి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించే మొదటి నీటి పారుదల ప్రాజెక్టు జూరాల. జూలైలో మొదలుకుని సెప్టెంబర్ వరకూ జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. జూరాల నిండినప్పుడు, గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినప్పుడు అక్కడకు సందర్శకులు పోటెత్తుతారు.
కృష్ణమ్మ జలపరవళ్లను తిలకించేందుకు ఉమ్మడి జిల్లా సహా కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది జూరాలకు తరలివస్తున్నారు. అక్కడి ప్రకృతి అందాలను చూస్తూ సేదతీరుతున్నారు. అయితే పర్యాటకుల రద్దీ పెరుగుతున్నా అక్కడ కనీస వసతులు కూడా ఉండవు. వాహనాలు నిలిపేందుకు పార్కింగ్, తాగేందుకు నీళ్లు, తినేందుకు తిండి, సేద తీరేందుకు ఎలాంటి వసతులు ఉండవు.