Heart Attacks While Workout and Playing :ఇటీవల కాలంలో ఆటలు ఆడుతున్నప్పుడు, డ్యాన్స్, వ్యాయామం చేస్తున్నప్పుడు చాలా మంది ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా చనిపోతున్నారు. వీరిలో ఎక్కువగా చిన్నారులే ఆటలు ఆడుతూ మృత్యువాత పడుతున్న ఘటనలు ఉన్నాయి. వీటన్నింటికీ ఒకే కారణం గుండెపోటు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలా గుండెపోటుకు గురికాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆటలు ఆడటం, వ్యాయామం చేస్తే ప్రాణాలు కాపాడుకునేవాళ్లు అవుతారని నిపుణులు చెబుతున్నారు.
ఈ మధ్యకాలంలో అలా ఆడుతూపాడుతూ మరణించిన కొన్ని ఘటనలు :
- మొదటి బంతికే ఔటైన ఓ యువకుడు బ్యాట్ పక్కన పడేసి వెనుదిరుగుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి క్రీడాకారులు సపర్యలు చేసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఓ యువకుడు (27) క్రికెట్ ఆడుతూ మరణించాడు.
- ఖమ్మం నగరానికి చెందిన ఓ యువకుడు 2023 జులై 10వ తేదీ జిమ్‌లో కాసేపు సాధన చేశారు. ఇంటికి తిరిగొస్తున్న క్రమంలో తనకు గాలి ఆడటం లేదని కుటుంబీకులకు తెలిపారు. ఆసుపత్రికి తరలించేలోగా యువకుడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
ఎందరో ఆటకు దూరం :మైదానంలో ఆటలాడుతూ ఒకరు, జిమ్‌లో సాధన చేస్తూ మరొకరు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల కాలంలో తరచూ చూస్తున్నాం. భారత జట్టులో ఫిట్‌నెస్ నిరూపించుకోలేదని సచిన్ తెందూల్కర్ లాంటి దిగ్గజ క్రికెటర్‌ను ఆటకు ముందు ఆపిన సందర్భాలున్నాయి. 50 ఓవర్ల మ్యాచ్ ఆడేందుకు శారీరకంగా సిద్ధంగా ఉన్నారా లేదా అని తేల్చేందుకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. భారత జట్టులో ఇప్పటివరకు ఆడిన మహామహులు సైతం అందరూ ఏదో ఒక సందర్భంలో ఫిట్‌నెస్ పరీక్షల ద్వారా ఆటకు దూరమైన సందర్భాలు ఉన్నాయి. కసరత్తు లేకుండా బ్యాట్, బంతి తీసుకుని బయల్దేరితే ప్రమాదంతో చెలగాటమాడినట్టేనని కపిల్‌దేవ్ లాంటి ఉద్ధండ క్రికెటర్ అనేక వేదికలపై చెప్పారు.