Health Issues Due to Lack of Sleep : అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల పది ప్రధాన అలవాట్లలో సూర్యోదయానికి ముందే నిద్రలేవటం ఒకటి. మూడు దశాబ్దాల కిందటి వరకు ప్రపంచమంతటా ఇదే పరిస్థితి ఉండేది. దీన్ని పాటించిన మన తాతలు, ముత్తాతలు ఆసుపత్రుల మెట్లెక్కిన ఘటనలు చాలా తక్కువ. శారీరక శ్రమ చేసేవారు. ఒళ్లు తెలియకుండా నిద్రించేవారు. మారిన జీవన విధానంలో నేడు 20 ఏళ్లకే షుగర్, 30 ఏళ్లకే రక్తపోటు వంటి వాటి బారిన పడుతున్నారు. అయిదేళ్ల కిందట ప్రతి వందలో పది మంది బాధితులుంటే, ప్రస్తుతం ఆ సంఖ్య రెట్టింపయింది. సూర్యోదయాన్ని చూడకపోవడమే ఇందుకు కారణం.
గద్వాల పట్టణానికి చెందిన ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పక్కనున్న దుకాణానికి సైతం ద్విచక్ర వాహనం వాడతాడు. రాత్రి 12 తరువాతే నిద్రిస్తాడు. గంటల తరబడి కూర్చోవడంతో వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నాడు.
ఇలా చేయండి!
- రెస్‌మెడ్ స్లీప్ -2024 సర్వే ప్రకారం దేశంలో 27 శాతం మంది మాత్రమే రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్రపోతున్నారు.
- తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి. రాత్రివేళ ఏడు గంటలకు భోజనం చేసి త్వరగా నిద్ర పోవాలి.
- ప్రతి రోజూ కనీసం అరగంట యోగా చేయాలి. అందువల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు ఎన్నో కలుగుతాయి. మానసిక ఒత్తిడి తదితర సమస్యలతో బాధపడే వారికి ఇది ఉపయోగపడుతుంది. మహిళల్లో నెల సరి సమస్యలు సైతం దూరమవుతాయి.
- కుటుంబంతో నెలకు రెండు రోజులు అయినా సరదాగా గడపాలి. వీలు దొరికితే అన్నీ మరచిపోయి చిన్న పిల్లలతో ఆడటం వల్ల మానసిక ఒత్తిడి మన దరిచేరదు.
"నా వయస్సు 82 సంవత్సరాలు. చాలా సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఉదయం 4 గంటలకే నిద్రలేస్తాను. రాత్రి ఏడింటికే భోజనం చేస్తాను. జొన్న రొట్టె, రాగి సంగటి తప్పనిసరిగా తీసుకుంటాను. ఇప్పటికీ షుగర్, బీపీ లేదు. నేటి తరం జీవన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరముంది." - బజారన్న, ఇటిక్యాల