HCU Study on Youngsters Musical and Literary Tastes :తెలుగు పాటలు, పద్యాలు, జానపదాలు, పాశ్చాత్య సంగీత హోరు వీటిన్నింటిలో ఏది ఇష్టమని అడిగితే శైలి ఏదైనా సినిమా సాంగ్స్ అంటేనే ఇష్టమని యువతీయువకులు చెబుతున్నారు. 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు, 25ఏళ్లు ఆపై వయసున్న యువతీ యువకుల ఇష్టాలపై గతేడాది హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని సంగీత విభాగం అధ్యయనం చేసింది. వర్సిటీలోని పీజీ, ఇంజినీరింగ్ విద్యార్థులు, పరిశోధకుల్లో మొత్తం 350 మందిని సెలెక్ట్ చేసి వారితో మాట్లాడారు. 350 మందిలో 168 మంది సినిమా మ్యూజిక్‌నే ఇష్టపడుతున్నామని చెప్పారు.
వేగం, శ్రావ్యం, సమ ప్రాధాన్యం : మూవీ సాంగ్స్‌లో వేగంగా పూర్తయ్యే వాటితో పాటు శ్రావ్యమైన పాటలకు విద్యార్థులు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. చాలా మంది సినిమా పాటల్లో సాహిత్యాన్ని పట్టించుకోవడం లేదు. తాము కూడా పాటలు పాడేలా ఉండే రాగాన్ని ఇష్టపడుతున్నారు. పాటలోని పదాలు, మాటలు అర్థమైనా కాకపోయినా సింగర్స్ ఆలాపన, సంగీత కళాకారుల వాయిద్యాల సమ్మిళితాన్ని గమనిస్తున్నారు.
దాదాపు 90 శాతం మంది మొబైల్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని మరి పాటలు వింటున్నారు. 50 శాతం మంది విద్యార్థులు గంటకుపైగా సంగీతాన్ని వింటూ సేదతీరుతున్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని సంగీత విభాగం సహ ఆచార్యులు ప్రగ్యా ప్యాసీ, పరిశోధక విద్యార్థి మోహిత్ మెహతాలు ఈ అధ్యయనాన్ని చేశారు. దీన్ని ఇటీవలె నాద్-నర్తన్ జర్నల్ ప్రచురించింది.
''డిగ్రీ కాలేజీలు, ఇతర వర్సిటీల్లోని విద్యార్థులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడకపోయినా, డిజిటల్ సంగీతాన్ని ఇష్టపడుతున్నారు. ఇది మా అధ్యయనంలో వెల్లడైంది. మొబైల్ ఫోన్లో వార్తా విశేషాల ద్వారా వీరు సినిమాల గురించి తెలుసుకుంటున్నారు. సినిమా పాటలు వింటూ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారంటే మానసికంగా ఉల్లాసంగా ఉంటున్నారనే దీని అర్థం'' - డా.పగ్యా ప్యాసీ, సహాయ ఆచార్యులు
డిజిటల్‌కు పెరుగుతున్న ఆదరణ : డిగ్రీ కాలేజీలు, ఇతర వర్సిటీల్లోని విద్యార్థులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడకపోయినా డిజిటల్ సంగీతాన్ని ఇష్టపడుతున్నారని హెచ్‌సీయూ సహాయ ఆచార్యులు డా.పగ్యా ప్యాసీ తెలిపారు. ఇది తమ అధ్యయనంలో వెల్లడైందని చెప్పారు. మొబైల్ ఫోన్లో వార్తావిశేషాల ద్వారా వీరు సినిమాల గురించి తెలుసుకుంటున్నారని తెలిపారు. దాని ఆధారంగా సినిమా పాటలు వింటున్నారని పేర్కొన్నారు. సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారంటే మానసికంగా ఉల్లాసంగా ఉంటున్నారనే దీని అర్థమని వ్యాఖ్యానించారు. దీంతో విద్యార్థులు వారి లక్ష్యలను సులువుగా చేరుకుంటున్నారని వివరించారు.
సంగీత, సాహిత్యపై యువత ప్రాధాన్యాలిలా (ETV Bharat)