తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థులు ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేదా? : హరీశ్‌రావు - HARISH RAO SLAMS CM REVANTH REDDY

Harish rao Slams CM Revanth : ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే సర్కారు పాఠశాలలు అధ్వాన్నంగా మారాయని మాజీ మంత్రి హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలను హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. అన్నంలో పురుగులు, రాళ్లు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆయన మండిపడ్డారు.

Harish Rao visit Palamakula Gurukula
Harish rao Slams CM Revanth (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 7:19 PM IST

Updated : Aug 31, 2024, 7:43 PM IST

Harish Rao visit Palamakula Gurukula : ప్రతిపక్షాల మీద విమర్శ చేయడం తప్ప, సీఎం రేవంత్‌రెడ్డికి పాలన మీద దృష్టిలేదని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఎందుకు స్పందించడంలేదని, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారనీ ఆయన నిలదీశారు. ప్రసార మాధ్యమాల్లో, సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న విద్యార్థుల ధర్నాను చూసి పాలమాకుల గురుకుల పాఠశాలను సందర్శించినట్లు మాజీమంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

పురుగుల అన్నమే దిక్కు : ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ విద్యార్థులు తమ సమస్యలపై ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేదని మండిపడ్డారు. గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. గురుకులాల్లో అన్నం, పప్పులో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని, అడిగితే కర్రలు విరిగేలా కొడుతున్నారని విద్యార్థులు చెప్పడం బాధాకరమన్నారు.

ఇప్పటివరకు ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారని, రెండో జత ఇవ్వలేదని విద్యార్థులు తనతో వాపోయారని హరీశ్‌రావు పేర్కొన్నారు. పుస్తకాలు కూడా ఇవ్వని పరిస్థితి వచ్చిందని, కేసీఆర్‌ హయంలో గురుకుల పాఠశాలలు ఆదర్శంగా ఉండేవని, ఇప్పుడు ఇక్కడ చదివించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. పాలమాకుల గురుకులాల్లో ఉన్న టీచర్లను మార్చాలని, విద్యార్థులకు మంచి భోజనం పెట్టాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

సబితా ఇంద్రారెడ్డి ఫైర్ : ప్రభుత్వం గురుకులాలను గాలికి వదిలేసిందని, విద్యాశాఖను పట్టించుకోవడం లేదని మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దుయ్యబట్టారు. విద్యార్థులు ఏం అడిగినా పట్టించుకునే వారే లేరని మండిపడ్డారు. చిన్నారుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. తక్షణమే గురుకులాలపై దృష్టి సారించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

"ప్రసార మధ్యమాలు, సోషల్‌ మీడియాలో వచ్చిన వార్తలను చూసి పాలమాకుల గురుకుల పాఠశాలను చూడటానికి వచ్చాము. విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకుంటూ ఏడుస్తున్నారు. అన్నం, పప్పులో పురుగులు వస్తున్నాయని ఫిర్యాదు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. వాటిని తీసేసి తినమంటున్నారని విద్యార్థులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారని, రెండో జత ఇవ్వలేదని విద్యార్థులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి". - హరీశ్‌రావు, మాజీమంత్రి

ప్రభుత్వ పట్టింపులేనితనం విద్యార్థులకు శాపం - పాలమాకుల గురుకుల పాఠశాల నిరసనపై హరీశ్​రావు ట్వీట్

సమస్యల వలయంలో గురుకులాలు - సత్వరమే సర్కార్​ స్పందించాలని హరీశ్​రావు డిమాండ్​

Last Updated : Aug 31, 2024, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details