Harish Rao Letter to Minister Uttam on Reservoirs :సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ జలాశయాలు పూర్తిగా నీళ్లు లేక అడుగంటిపోయే పరిస్థితికి చేరుకున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ మేరకు ఆయన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి దీనిపై లేఖ రాశారు. గత సంవత్సరం ఇదే ఆగస్టు నెలలో ఆయా జలాశయాల్లో నీరు నిల్వ ఉందని, ఇప్పుడు చాలా తక్కువ నీరు ఉందని పేర్కొన్నారు. ఒకవైపు జలాశయాల్లో నీళ్లు లేక, మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని వ్యాఖ్యానించారు.
పంటలు వేయాలా వద్దా అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. గత సంవత్సరంలో ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల్లో పంటల సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోయిందని వెల్లడించారు. రాజకీయాలు పక్కనపెట్టి మధ్యమానేరు నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్లకు నీటిని పంపింగ్ చేసేలా అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా రైతాంగం పక్షాన కోరుతున్నానని పేర్కొన్నారు.