Harish Rao On CM Revanth : రుణమాఫీ సంపూర్ణంగా అయిందో లేదో రాష్ట్రంలోని ఏ ఊరికైనా పోయి నేరుగా రైతుల్నే అడుగుదామని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, సీఎం వ్యవహారశైలి ప్రజలు గమనిస్తున్నారని దొంగతనం చేసిన వారే దొంగ దొంగ అన్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. రుణమాఫీ పాక్షికంగా చేశామని, తప్పు అయిందని క్షమాపణ అడగాలి లేదా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయనన్నారు.
రుణమాఫీ 46 శాతం మాత్రమే జరిగిందని, ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందన్న హరీశ్‌రావు, రుణమాఫీ కాలేదని తెలంగాణ భవన్ కు ఇప్పటి వరకు లక్షా 16వేల ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. రుణమాఫీ, ఆరు గ్యారంటీలు సంపూర్ణంగా చేస్తే రాజీనామా చేస్తానని తాను స్పష్టంగా చెప్పానని గ్యారంటీల సంగతి ఏమో కానీ, రుణమాఫీ కూడా మొత్తం చేయలేదని మాజీమంత్రి ఆక్షేపించారు.
రేవంత్ రెడ్డి చరిత్ర, తన చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలుసని కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట తప్పింది ఎవరని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోసం రాజీనామా చేసిన చరిత్ర తనదైతే, తెలంగాణ ప్రజల పైకి రైఫిల్ పట్టుకొని పోయిన చరిత్ర రేవంత్ రెడ్డిదని వివరించారు. రుణమాఫీ కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ కన్నీరు కారుస్తున్నారని, రైతులు ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారని ఆయన తెలిపారు.
రుణమాఫీపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన హరీశ్ రావు రైతులు, డబ్బు సహా వివరాలు ప్రకటించాలని అన్నారు. 'రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్లాఫ్ తొండి చేయడంలో తోపు బూతులు తిట్టడంలో టాప్' అని అభివర్ణించారు. రాష్ట్రంలోని హిందూ, ముస్లిం, క్రైస్తవ దేవుళ్లు అందరిపైనా రేవంత్ రెడ్డి ఒట్లు వేశారని గుర్తు చేశారు. పాలకులు పాపం చేస్తే రాష్ట్రానికి ఎక్కడ నష్టం జరుగుతుందో అని ప్రజలు భయపడుతున్నారని పేర్కొన్నారు.