Nigama Chandra Inspiring Life Story :ఆశ.. ఎంతటి ప్రాణాంతక వ్యాధి బారినపడ్డ కూడా బతికిస్తుందంటారు. అటువంటి ఆశావహ దృక్పథమే నిగమచంద్రదీ. అదే ఆమెను నేడు విజేతగా నిలిపింది. ప్రాణాంతక మస్క్యులర్ డిస్ట్రోఫీ వ్యాధి బారినపడ్డా, సంకల్ప శక్తితో ఎదుర్కొని, అదే వ్యాధిపై పీహెచ్‌డీ చేసిన ఘనత ఆమె సొంతం. ఈ మేరకు శనివారం కేఎల్ వర్సిటీ స్నాతకోత్సవంలో ఆమె పట్టా అందుకున్నారు.
ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడకు చెందిన నిగమచంద్ర 19 ఏళ్ల వయసులో మస్క్యులర్ డిస్ట్రోఫీ వ్యాధి బారిన పడ్డారు. ఉన్నట్టుండి నడవలేకపోవడం, కూర్చున్నచోటు నుంచి లేవలేకపోవడంతో డాక్టర్లను సంప్రదించగా, అరుదైన కండరాల క్షీణత వ్యాధి సోకిందని, మందులు లేవని, రెండేళ్ల వరకే బతికే ఛాన్స్ ఉందని చెప్పారు. ఎంతమంది డాక్టర్లను సంప్రదించినా ఇదే మాట చెప్పారు. చిన్నవాళ్లైతే అసలు నిలబడలేరు. ముందుగా కాళ్లు చచ్చుబడి క్రమక్రమంగా ఊపిరితిత్తులు, గుండె వరకు సోకి రోగి మరణిస్తారు.
తనలా మరెవరూ ఈ వ్యాధితో బాధపడకూడదన్న బలమైన సంకల్పం:చిన్నపిల్లలకు డయాగ్నసిస్ చేస్తే 16 ఏళ్ల వరకు బతికే ఛాన్స్ ఉంది. 19 ఏళ్ల తరువాత వస్తే మేనేజ్‌మెంట్ థెరఫీ విధానం ద్వారా బతికే అవకాశం ఉంది. దీన్ని ప్రాథమిక దశలో గుర్తించిన నిగమచంద్ర, వైద్యం కోసం దేశమంతటా తిరిగారు. ఎక్కడా ఫలితం దక్కకపోవడంతో పదకొండు సంవత్సరాలుగా ఫిజియోథెరపీ చేయించుకున్నారు. యోగా, మెడిటేషన్ ద్వారా మానసికంగా దృఢంగా తయారయ్యారు. తనలా మరెవరూ ఈ వ్యాధితో బాధపడకూడదన్న బలమైన సంకల్పంతో ఆ వ్యాధిపైనే రీసెర్చ్ చేయాలని దృఢంగా నిర్ణయించుకున్నారు. కేఎల్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశారు. తద్వారా సౌత్ ఇండియాలో తొలి మహిళగా గుర్తింపు పొందారు.
రాష్ట్రవ్యాప్తంగా 5,000 మందికిపైగా వ్యాధి పీడితులను ఐడెంటిఫై చేసి, తీవ్రత ఏ వయసు వారికి ఎంత శాతంలో ఉందో వివరాలు సేకరించారు. వీరంతా డాక్టర్ల సూచనల ప్రకారం చికిత్స తీసుకుని ఉపశమనం పొందారా? లేక సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇతరత్రా ఏమైనా వచ్చాయా? అన్నది క్షుణ్నంగా పరిశీలించారు. సీపీకే, మజిల్ బయాప్సీ, జెనటిక్ టెస్ట్ ద్వారా వ్యాధి ప్రాథమిక దశలో కనిపెట్టి చిన్నపిల్లల్లో మరణాలను తగ్గించవచ్చని, దీనికి సరైన థెరపీ ఇవ్వడం ద్వారా వారిని బతికించుకోవచ్చన్న అంశాలపై అధ్యయనం చేశారు. రీసెర్చ్ డాక్యుమెంట్ను ప్రభుత్వానికి అందజేస్తానని, వ్యాధి పీడితులకు సరైన వైద్యం లభించేలా తన వంతు కృషి చేస్తానని నిగమచంద్ర చెప్పారు. ప్రస్తుతం అమరావతి మస్క్యులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ నడుపుతూ అవగాహన కలిగిస్తున్నానని వివరించారు. అంతకుముందు ఆమె యూకేలో మాస్టర్స్ పబ్లిక్ హెల్త్ మాస్టర్స్ చేశారు.
YUVA : లక్ష్యం ముందు చిన్నబోయిన శారీరకలోపం - గురిపెడితే మెడల్ ఖాయం - DHANUSH SRIKANTH IN KHELO INDIA