GST Refund Scam in Income Tax Department:బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 జూలై నుంచి 2023 నవంబర్ వరకు జరిగిన రీఫండ్ అక్రమాలపై "ఈ ఏడాది మార్చి 18న 'ఈటీవీ తెలంగాణ'' పరిశోధనాత్మక కథనం వచ్చింది. ఈ-బైక్‌ల తయారీ, టాల్కమ్ పౌడర్ ఉత్పత్తి సంస్థల పేరుతో డీలర్ల అవతారమెత్తిన కొందరు అక్రమార్కులు సర్కారు సొమ్మును దోచేశారు. వాణిజ్య పన్నులశాఖలోని కొందరు అధికారులు అవినీతిపరులతో చేతులు కలిపి ఇష్టానుసారంగా రీఫండ్‌లు ఇచ్చేశారు.
హైదరాబాద్ రూరల్ డివిజన్, ప్రస్తుత మాదాపూర్ డివిజన్ పరిధిలో ఈ బాగోతం జరిగింది. డిప్యూటీ కమిషనర్ నుంచి డీసీటీవో వరకు కమిషన్లు పంచుకున్నట్లు సమాచారం. మూడు నుంచి నాలుగు బోగస్ కంపెనీలకు సుమారు రూ. 60 కోట్లు రిఫండ్ చేసినట్లు తెలుస్తోంది. కొందరు అధికారులైతే తాను బదిలీ అయిన చోటుకు సైతం ఆ బోగస్ సంస్థలను బదిలీ చేసుకుని మరీ రీఫండ్‌లు ఇచ్చినట్లు తేలింది.
GST Assessments In Telangana: ఈ-బైక్‌ల అమ్మకాలను ప్రోత్సహించేందుకు కేంద్రం 5 శాతం జీఎస్టీ మాత్రమే విధిస్తోంది. దీనిని ఆసరా చేసుకున్న అక్రమార్కులు మాదాపూర్ కేంద్రంగా బోగస్ సంస్థలకు తెరలేపారు. ఈ-బైక్‌ల తయారీ నిమిత్తం జీఎస్టీ లైసెన్స్‌లు తీసుకున్నారు. ఈ లైసెన్స్‌లు ఇచ్చే ముందు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు మాత్రమే ఇవ్వాల్సి ఉంది. కానీ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకుండానే లైసెన్స్‌లు ఇచ్చేశారు. ఆ సంస్థ వ్యాపార కార్యకలాపాలు చేస్తుందో లేదో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు.
బయట నుంచి ఈ-బైక్ విడిభాగాలు తీసుకొచ్చినట్లు వాటిపై 18 శాతం జీఎస్టీ చెల్లించినట్లు ఇన్‌వాయిస్‌లు సృష్టించారు. ఆ విడిభాగాలను అసెంబుల్ చేసి 5 శాతం జీఎస్టీతో ఈబైక్‌లు అమ్మినట్లు బిల్లులు అప్‌లోడ్ చేశారు. విడిభాగాల విలువపై చెల్లించిన 18 శాతం జీఎస్టీలో కేంద్ర నిబంధన ప్రకారం 13 శాతం రాయితీ పొందారు. రూపాయి పెట్టుబడి పెట్టకుండా ప్రభుత్వ సొమ్మును దోచేసిన అక్రమార్కులు అధికారులకు అడిగినంత కమిషన్ ఇచ్చారు. కోటి రూపాయిలు రీఫండ్ ఇస్తే రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు అధికారులు కమిషన్లు తీసుకున్నట్లు అభియోగాలు ఉన్నాయి.