HMDA Layouts Banned Issue :హెచ్ఎండీఏ పరిధిలోని వందలాది పంచాయతీ లేఅవుట్లు నిషేధిత జాబితాలో చేర్చారని కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు ఇదే విషయంపై తీవ్ర చర్చ నడుస్తోంది. దీనిపై రకరకాల ఊహాగానాలు, వదంతులు వినిపిస్తుండటంతో ఆయా లేఅవుట్ల యజమానులు బెంబేలెత్తి పోతున్నారు. ఈ క్రమంలో వారు హెచ్ఎండీఏ కార్యాలయానికి పరుగుతీస్తున్నారు. ఈ విషయాన్ని వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ జాబితాపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు అధికారులు ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
గతంలో వందలాది పంచాయతీ లేఅవుట్లు హెచ్ఎండీఏ ఏర్పడకముందు ఏర్పడ్డాయి. ఇవి ముఖ్యంగా రంగారెడ్డి, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్‌మెట్, ఆదిభట్ల, మంగల్‌పల్లి, మన్నెగూడ, తుర్కయంజాల్, కమ్మగూడ, రాగన్నగూడ, నాదర్గుల్, గుర్రంగూడ, బాలాపూర్ తదితర ప్రాంతాల్లో వందలాది పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయి. వీటిని అప్పుడే లేఅవుట్లు వేసి విక్రయించేశారు. హెచ్ఎండీఏ వచ్చిన తర్వాత ఈ లేఅవుట్లలో కొన్నింటిని క్రమబద్ధీకరించారు. ఈ క్రమంలో వీటిలో పెద్దపెద్ద బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి.
ప్రస్తుతం ఇవన్నీ నగరానికి సమీపంలో ఉన్నాయి. ఇక్కడ భూములు ధరలు సైతం భారీగానే పలుకుతున్నాయి. ఇంకా కొన్ని లేఅవుట్ల క్రమబద్ధీకరించలేదు. వీటి కోసం గతంలో చాలా మంది రూ.1000 చెల్లించి అక్రమంగా లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంతలోనే ఈ నిషేధిత జాబితా సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొట్టింది. దీంతో ఒక్కసారిగా దరఖాస్తుదారులు అవాక్కయ్యారు. ఇదేంటి ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకుంటే నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయందని లబోదిబోమంటున్నారు.