Govt Teacher Trained DSC Candidates Through WhatsApp :పోటీ పరీక్షల కోచింగ్‌కు హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లే స్తోమతలేని అభ్యర్థులు చాలామంది ఇంటి వద్దే ఉంటూ సన్నద్ధమవుతుంటారు. ప్రతిభ ఉన్న వారిలో ఎక్కువమందికి సరైన గైడెన్స్ ఇచ్చేవారు లేక విజయావకాశాలు చేజారుతున్నాయి. డీఎస్సీ-2024కు ఇలా ఇంటివద్దే ఉంటూ చదువుకున్న చాలామందికి ఓ గవర్నమెంట్ టీచర్ సోషల్ మీడియా ద్వారా శిక్షణ ఇచ్చారు.
Teacher Jobs With The Help Of Training In WhatsApp : ఆయన శిక్షణ, గైడెన్స్‌తో రాష్ట్ర వ్యాప్తంగా 35మందికి పైగా అభ్యర్థులు టీచర్స్ జాబ్స్‌ను సాధించటం విశేషం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం రామానుజవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో గోరింట్ల సురేశ్ భౌతికశాస్త్రం బోధిస్తున్నారు. నిత్యం జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ 10 ప్రశ్నలు తయారు చేసి స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసేవారు. మరుసటి రోజు వాటికి ఆన్సర్లను అందించేవారు. ఈ క్రమంలో కొందరు అభ్యర్థులు డీఎస్సీకి సన్నద్ధమయ్యేందుకు గైడెన్స్ ఇవ్వాలని కోరారు. దీంతో ఆయన పలు జిల్లాలకు చెందిన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులతో గతేడాది సెప్టెంబరులో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు.
ఆన్లైన్ వేదికగా గైడెన్స్ : ప్రతి పరీక్ష విభాగంలో పట్టు సాధించేందుకు అవసరమైన ప్రామాణిక పుస్తకాలను అభ్యర్థులకు సూచించారు. స్వయంగా తానే బుక్స్ కొని, వాటిల్లో రోజువారీగా చదవాల్సిన అంశాలు, పేజీలను గ్రూపులో పోస్టు చేసేవారు. ఈ విధంగా రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో కనీసం రెండు పరీక్షల్ని అన్‌లైన్లో నిర్వహించారు. అభ్యర్థులకు ఆదివారం గ్రాండ్ టెస్టులు నిర్వహించేవారు. టెస్టులు రాసిన వారికి ర్యాంకులను కేటాయించి వారి పురోగతి తెలుసుకునేలా చేసేవారు.