Two Major Schemes in Telangana :రాష్ట్ర ప్రభుత్వం 1.40 కోట్ల ఎకరాలకు రైతు భరోసా, 11 లక్షల నిరుపేద రైతు కూలీల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మూడు కోట్ల మందికి సన్న బియ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 26వ తేదీ నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయనున్న ప్రభుత్వం ఏప్రిల్ నుంచి సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటీ అమలు చేసుకుంటూ పోతోంది. సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలని, అర్హులైన రైతు కూలీల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని, అర్హత కలిగిన తెల్ల రేషన్‌కార్డు దారులకు ఏప్రిల్ నుంచి సన్న బియ్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఆయా పథకాలకు సంబంధించి జిల్లాల నుంచి వివరాలు తెప్పించుకుని అర్హుల జాబితాలు సిద్ధం చేసింది.
సాగు భూములకే రైతు భరోసా : రాష్ట్రవ్యాప్తంగా వర్షాకాలంలో సాగైన భూమి వివరాలను వ్యవసాయ శాఖ నుంచి ప్రభుత్వం తెప్పించుకుంది. దాదాపు ఒక 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఆ శాఖ గణాంకాలను ప్రామాణికంగా తీసుకుని రైతు భరోసా చెల్లించాలని భావించిన ప్రభుత్వం ఆ మేరకు అవసరమైన నిధులను సిద్ధం చేసుకుంది. సాగుకు యోగ్యమైన భూమి కూడా ఇంతకు మించి ఉండే అవకాశం లేదని అంచనా వేస్తున్న ప్రభుత్వం 1.40 కోట్ల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. వ్యవసాయ యోగ్యంకాని మైనింగ్, కొండలు, గుట్టలకు, రాళ్లకు రప్పులకు, స్థిరాస్తి వెంచర్లకు, అనర్హులకు ఎవరికీ రైతు భరోసా వెళ్లకుండా ఉండేందుకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు సంయుక్తంగా తయారు చేసిన సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే చెల్లింపులు జరిగేటట్లు జాగ్రత్తలు తీసుకుంది.
38 లక్షల మందికి ఉపాధి హామీ జాబ్ కార్డులు :తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 38లక్షల ఉపాధిహామీ జాబ్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల నుంచి భూమి కలిగిన వారు రైతు భరోసా కింద లబ్ధి పొందుతున్నందున వారిని పక్కన పెట్టారు. దాదాపుగా 20లక్షల ఎన్ఆర్జీఎస్ కార్డులు ఉన్నట్లు తేలింది. అయితే గడిచిన రెండేళ్లుగా పని చేసిన కార్డుదారులను అర్హులుగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.