Govt Focus On Sorghum Procurement : జొన్న రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో జొన్నల కొనుగోలుకు సర్కారు సిద్ధమైంది. ఆదిలాబాద్, నిజామాబాద్ రైతుల విజ్ఞప్తి మేరకు జొన్న కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో జొన్నలు కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. గతంలో ఉన్న పరిమితిని కూడా పెంచింది. జొన్న రైతులెవరూ తక్కువ ధరకు పంటను అమ్ముకోవద్దని మంత్రి తుమ్మల సూచించారు. మద్ధతు ధరకే పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వెల్లడించారు.
Sorghum Procurement In Telangana :ఏటా ఆనవాయితీ ప్రకారం తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య - మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా ఇప్పటికే క్వింటాల్‌కు మద్ధతు ధర రూ.3180 రూపాయలు చెల్లించి రైతుల వద్ద నుంచి జొన్న కొనుగోలు చేస్తున్న విషయం విదితమే. అయితే గత 5 ఏళ్లుగా దిగుబడుల ఆధారంగా ఎకరానికి 8.85 క్వింటాళ్ల పరిమితిని విధించి కొనుగోలు చేస్తున్న సందర్భంలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఈ ఏడాది యాసంగి సీజన్‌లో పంట దిగుబడులు పెరిగాయి. ఆ మేరకు ఎకరానికి ఇంతకు ముందున్న పరిమితిని పెంచాలని రైతుల నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి.
మద్ధతు ధరకే ప్రభుత్వం జొన్నపంట కొనుగోలు చేస్తుంది:ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో జొన్న పంట పండించిన రైతుల విజ్ఞప్తి మేరకు సంబంధిత జిల్లా అధికారుల నివేదికల ఆధారంగా ప్రభుత్వం జొన్న కొనుగోళ్లపై ఆ రెండు జిల్లాల్లో ఎకరాకు ఇంతకు ముందు ఉన్న 8.85 క్వింటాళ్ల పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తదనుగుణంగా చర్యలు చేట్టాలని కొనుగోలు ఏజెన్సీ మార్క్‌ఫెడ్ సంస్థను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. జొన్న రైతులెవరూ తొందరపడి తక్కువ రేటుకు అమ్ముకోవద్దని సూచించారు.