Battery Storage Projects In AP :రాష్ట్ర విద్యుత్ రంగంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (BESS)ను ప్రభుత్వం తీసుకురాబోతోంది. దీని ద్వారా గ్రిడ్ బేస్‌లోడ్ పునరుత్పాదక ఇంధన వనరులను ఏకీకృతం చేయడంతోపాటు అవసరమైన సమయంలో వినియోగించుకునేందుకు వీలుగా బ్యాకప్ విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. దీంతో పీక్ డిమాండ్ వేళల్లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలుతో ప్రజలపై పడే భారాన్ని కొంత తగ్గించవచ్చని ప్రభుత్వ అంచనా.
అదనపు విద్యుత్ కొనుగోలు భారం తగ్గుతుంది : ఇందుకోసం కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో రెండు వేల మెగావాట్లబ్యాటరీ ఎనర్జీ స్టోరేజి సిస్టం యూనిట్ల ఏర్పాటుకు సంస్థలను ఎంపిక చేయబోతోంది. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో పీక్ డిమాండ్ సమయంలో (ఉదయం 6 నుంచి 8 గంటలు, రాత్రి 7 నుంచి 11 గంటలు) కొన్ని రోజుల్లో తక్కువ వినియోగం వల్ల సుమారు 680 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ మిగిలిపోతోంది. మరికొన్ని సమయాల్లో అదనంగా 600 ఎంయూలు కొనుగోలు చేసినట్లు డిస్కంలు లెక్క తేల్చాయి.
వైఎస్సార్సీపీ దెబ్బకు భారంగా మారిన విద్యుత్ ఛార్జీలు - భారం మోపకుండా ఏం చేయాలి? - Pratidhwani on Power Charges in ap
అదనపు డిమాండ్‌ను సర్దుబాటు చేయడానికి బహిరంగ మార్కెట్‌లో 750 నుంచి 1000 మెగావాట్ల విద్యుత్‌ను కొనాల్సి వచ్చిందని డిస్కంలు చెబుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అధిక ధరకు కొందామన్నా దొరకని పరిస్థితి. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో యూనిట్ విద్యుత్‌కు సగటున రూ.7.50 నుంచి రూ.8.50 వరకు ఖర్చు చేసిన డిస్కంలు, ఆ భారాన్ని ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై వేశాయి. ఈ నేపథ్యంలో పీక్ డిమాండ్ సమయంలో కనీసం రెండు గంటలపాటు బీఈఎస్‌ఎస్ స్టోరేజీ విద్యుత్ వినియోగిస్తే అదనపు విద్యుత్ కొనుగోలు భారం కొంతయినా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
సౌరవిద్యుత్ అందుబాటులోకి ఆలోచన :ఏపీలో 4,300 మెగావాట్ల సౌర, 4,100 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో ప్రభుత్వం పీపీఏలు కుదుర్చుకుంది. సెకితో ఒప్పందం ద్వారా మరో ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్ రాబోతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు పీఎం కుసుమ్, పీఎం సూర్య ఘర్ ఆవాస్ యోజన కింద ఇంకో 3,725 మెగావాట్ల సౌరవిద్యుత్ అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. వీటన్నింటినీ మినహాయించినా ప్రస్తుతం ఉన్న పునరుత్పాదక విద్యుత్ పీపీఏల ద్వారా వచ్చే విద్యుత్‌లో డిమాండ్ తక్కువగా ఉన్న సమయంలో 450- 500 మెగావాట్లు మిగులుతోంది. బీఈఎస్‌ఎస్‌లో యూనిట్ విద్యుత్ నిల్వకు సుమారు రూ.3 నుంచి రూ.3.70 వరకు ఖర్చు అవుతుందని, లిథియం ధరలు తగ్గుతున్నందున ఈ ఖర్చూ క్రమంగా తగ్గుతుందని అధికారులు అంటున్నారు.
విద్యుత్ సంస్థల్లో నూతన సర్కిళ్లు - నేటి నుంచే కార్యకలాపాలు - New Electricity Circles in AP
విద్యుత్ స్టోరేజ్ ద్వారా వచ్చే ఆదాయంలో భారీగా వాటా :మొదటి దశలో 1000 మె.వా. చొప్పున 2 దశల్లో రెండు వేల మెగావాట్ల బీఈఎస్‌ఎస్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వాటిలో నిల్వ చేసిన విద్యుత్‌ను ఉదయం, సాయంత్రం పీక్ డిమాండ్ సమయంలో 2 గంటల చొప్పున వినియోగించుకునేందుకు డిస్కంలు ప్రతిపాదన సిద్ధం చేశాయి.
ఇలా సంవత్సరంలో 500- 600 ఎంయూల విద్యుత్ పీక్ డిమాండ్ సమయంలో అందుబాటులోకి వస్తుందని డిస్కంల అంచనా. ఏపీలో బీఈఎస్‌ఎస్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం 12 సంవత్సరాల పాటు వీలింగ్ ఛార్జీలు, ఐదు సంవత్సరాల పాటు ఎస్‌జీఎస్టీ మినహాయింపుతో పాటు విద్యుత్ స్టోరేజ్ ద్వారా వచ్చే ఆదాయంలో భారీగా వాటా ఇవ్వడం వంటి ప్రోత్సాహకాలను కల్పించనుంది.
కరెంటు బిల్లు ఎక్కువగా వస్తోందా?- ఈ టిప్స్ పాటిస్తే సగం డబ్బులు మిగిలినట్లే! - How to Reduce Electricity Bill