Mandamarri Govt School Students : ప్రభుత్వ పాఠశాలలో సైన్సు పాఠాలు చెప్పే ఓ ఉపాధ్యాయుడికి ఒక ఆలోచన తట్టింది. వ్యవసాయం గురించి పాఠాలు చెప్పడం కంటే పొలంలోకి విద్యార్థులను తీసుకువెళ్తే వారికి ఎక్కువ లాభం చేకూరుతుందమోనని భావించాడు. ఇలా అనుకోగానే మరుసటి రోజు విద్యార్థులకు విషయాన్ని చెప్పాడు. అంతే నిత్యం పాఠ్య పుస్తకాలతో కుస్తీలు పట్టే విద్యార్థులు పొలంబాట పట్టడానికి మంచి ఆసక్తి చూపారు.
వరినాట్లు వేస్తూ సందడి : పాఠశాలకు సమీపంలోని శంకర్ పల్లి గ్రామంలోని ఓ వ్యవసాయ పొలం దగ్గరికి తీసుకువెళ్లగా అక్కడ కొంతమంది వ్యవసాయ కూలీలు వరినాట్లు వేస్తున్నారు. వారిని చూసి విద్యార్థులు కూడా పొలంలోకి దిగి నారు తీసి వరి మొక్కలను నాటారు. ఈ ఆసక్తికర సంఘటన జరిగింది ఎక్కడో కాదు మన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రిలోనే. వరి నాట్లు వేసిన అనంతరం విద్యార్థులు పంట పొలాలు, పండ్ల తోటలను సందర్శించారు. నారుమడిలో వరి మొక్కలను సేకరించి నాటు వేస్తూ పిల్లలందరూ సందడి చేశారు.
"పుస్తకాలలో ఉన్న పాఠ్యాంశాలను నాలుగు గోడల మధ్యే కాకుండా ప్రత్యక్షంగా చూడడం వల్ల విద్యార్థులకు మరింత జ్ఞానం పెంపోందుతుంది. ఇక్కడి వ్యవసాయ పొలాలు, రైతులు, చేపల చెరువులను వారికి చూపించడం జరిగింది. రైతుల కష్టాలను ప్రత్యక్షంగా చూడడం ద్వారా భవిష్యత్తులో విలువలతో కూడినటువంటి జీవనాన్ని కొనసాగిస్తారు" -భీం పుత్ర శ్రీనివాస్, ఉపాధ్యాయుడు