Gov No Payment To Paddy Farmers Money at Mylavaram: రైతులు బహిరంగ మార్కెట్లో ధాన్యం అమ్మితే దళారీల చేతిలో మోసపోతారని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అందుకే ప్రభుత్వానికే ధాన్యం అమ్మితే మద్దతు ధరతో పాటు సొమ్ముకు భరోసా ఉంటుందని అధికారులు చెబుతారు. మరి రైతులు ఎంతో నమ్మకంగా ప్రభుత్వానికి ధాన్యం అమ్మితే డబ్బులు ఇస్తున్నారా అంటే అదీ లేదు. ప్రభుత్వ సహకార సొసైటీకి ధాన్యం అమ్మి రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే అదిగో ఇదిగో అంటూ వాయిదాలు వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మకంతో ప్రభుత్వానికి ధాన్యం అమ్మితే డబ్బులు రాకపోవటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాన్యం బకాయిలు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని లేకపోతే ఆందోళనలు చేపడతామని రైతులు హెచ్చరిస్తున్నారు.
రైతుల బకాయిలు రూపాయి లేకుండా చెల్లించండి: సీఎం
Farmers Sold Grain To Gov Co-Operative Societies: ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో గత సంవత్సరం డిసెంబరులో మిగ్జాం తుపానుకు కొంతమంది రైతులు దారుణంగా నష్టపోతే, మరికొందరు వరి పంటను జాగ్రత్తగా కాపాడుకున్నారు. ఇంత కష్టపడి పంటను కాపాడుకున్న రైతులకు ధాన్యంఅమ్మడం సమస్యగా మారింది. బయట మార్కెట్లో అమ్మడం ఇష్టం లేక రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వ సహకార సంఘాలకు ధాన్యాన్ని అమ్ముకున్నారు. ఉదాహరణకు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని వెల్వడం, పరిసర గ్రామ రైతులు సొసైటీకి ధాన్యాన్ని విక్రయించారు. ఆర్బీకే-1 ద్వారా 109 మంది రైతులు కోటి 22 లక్షల 7వేల 227 విలువైన ధాన్యాన్ని విక్రయించారు. రెండో ఆర్బీకే ద్వారా 120 మంది రైతులు 92 లక్షల 11వేల 145 రూపాయల విలువైన ధాన్యాన్ని అమ్ముకున్నారు. జనవరి 5న ధాన్యం విక్రయాలు జరగ్గా ఇప్పటివరకు డబ్బులు రైతులఖాతాల్లో చేరలేదు. అంటే రెండు నెలలుగా ధాన్యం డబ్బుల కోసం రైతులు కళ్లలో ఒత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. అధికారులను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా కాలయాపన చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఆన్లైన్ చేసి ఇన్ని రోజులైనా ఎందుకు ప్రభుత్వం ధాన్యం డబ్బులు విడుదల చేయడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.