Sriram Sagar Project Incomplete Works : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే నీటి ద్వారానే పెద్దపల్లి జిల్లా రైతులు ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. మంథని, రామగుండం ప్రాంతానికి డి-83, పెద్దపల్లి ప్రాంతానికి డి-86 కాలువ ద్వారా సాగునీరు అందిస్తున్నారు. జిల్లాలో గత యాసంగి సీజన్‌లో లక్ష 88 వేల 949 ఎకరాల్లో రైతులు వరి సాగుచేయగా అందులో అధికంగా ఎస్సారెస్పీ కింద లక్ష 62 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఐతే డిస్ట్రిబ్యూషన్ కాల్వలకు 20 ఏళ్ల కిందట వేసిన సిమెంట్ లైనింగ్ దెబ్బతినడం, తూములు, డ్రాపులు, యూటీలు ప్రవాహ ఉద్ధృతికి పాడవడంతో తరచూ కాలువలకు గండ్లు పడుతున్నాయి.
రైతులే సొంత ఖర్చుతో తాత్కాలిక మరమ్మతు చేసుకొని, పంటలు కాపాడుకుంటున్నారు. నీటి వినియోగ సంఘాలు రద్దు కావడంతో కాలువల నిర్వహణ అటకెక్కి, చివరి భూములకు నీరందడం లేదు. ఏటా చివరి భూములకు నీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎలిగేడు మండలం లాలపల్లి సమీపంలో ఎస్సారెస్పీ డి-86 ప్రధాన కాలువ తూముకు వరద ప్రవాహంతో గండి పడింది. ఏడాది కాలంగా మరమ్మతుకు నోచుకోలేదు. మేజర్, మైనర్ మరమ్మతుల కోసం 50 లక్షల పనులకు టెండర్లు పూర్తయ్యాయి. శాఖాపరమైన అనుమతులు, నిధులు కేటాయించాల్సి ఉంది. వర్షాకాలంలో వరదలకు కాల్వ గట్టు మరింత కోతకు గురయ్యే ప్రమాదం ఉంది.
ఎస్సారెస్పీ కాలువల మరమ్మతులకు మంజూరు కాని నిధులు :కాల్వ శ్రీరాంపూర్ డి-83 పరిధిలోని ఆర్ఎస్డి-4 కాలువ పెద్దపల్లి మండలం గుర్రాంపల్లి నుంచి వెన్నంపల్లి, జాఫర్‌ఖాన్‌పేట, ఇద్లాపూర్ వరకు వచ్చే కాలువ శిథిలావస్థకు చేరింది. పలు చోట్ల తూములు, కాలువ సీసీ పాడయ్యాయి. మరమ్మతులకు ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు. పంట కాలువల్లో భారీగా పూడిక చేరడం, నీటి అవసరాల కోసం కొందరు కాలువకు గండ్లు పెడుతుండటం, క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉండటంతో చివరి భూములకు నీరు చేరడం లేదు. ఉపాధి హామీలో పూడికతీత పనులు ఇష్టానుసారంగా నిర్వహిస్తుండటంతో ప్రయోజనం కలగడం లేదు.