Goulidodi Gurukula Students Protest : తమ పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలంటూ, ఉపాధ్యాయ దినోత్సవం రోజున గౌలిదొడ్డి గురుకుల విద్యార్థులు నిరసన బాటపట్టారు. ఫ్యాకల్టీని మార్చడంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల నియమించిన సిబ్బంది సరిగ్గా బోధించడం లేదని, వారికి ఐఐటీ, నీట్ సిలబస్‌పై సరైన అవగాహన లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం తిరిగి మళ్లీ పాత ఫ్యాకల్టీతో తమకు బోధన అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఉదయం నుంచే నిరసన :ఇటీవలే ప్రభుత్వం ఇక్కడ టీచింగ్ చేస్తున్న ప్రైవేటు ఫ్యాకల్టీని తొలగించి, వారి స్థానంలో కొత్త ఫ్యాకల్టీని ఏర్పాటు చేసింది. ఉదయం ఆరు గంటల నుంచి క్యాంపస్ వద్ద నిరసన కొనసాగిస్తున్నారు. బాలుర క్యాంపస్ విద్యార్థులకు తోడుగా పక్కనే ఉన్న బాలికలు క్యాంపస్ బయట బైఠాయించి ధర్నా చేపట్టారు. సోషల్ వెల్ఫేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఎస్సీ గురుకులాల జాయింట్ సెక్రటరీ సక్రూ నాయక్ సందర్శించారు. సమస్యను పరిష్కరిస్తామని విద్యార్థలకు హామీ ఇచ్చారు. విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ హామీతో విద్యార్థులు ధర్నా విరమించారు. అనంతరం క్యాంపస్ లోపలికి వెళ్లిపోయారు.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఎంపిక చేసి వారికి నీట్, ఐఐటీ కోచింగ్ ఇస్తున్నారు. గచ్చిబౌలి గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బాలికలు, బాలురకు వేరు వేరు క్యాంపస్‌లు ఉన్నాయి. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ మార్గదర్శకత్వంలో ఇక్కడి విద్యార్థులు ఐఐటీ, నీట్‌లలో ర్యాంకులు సాధిస్తున్నారు.