Google in Hyderabad : డిజిటల్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో రాష్ట్రం ముందు వరుసలో ఉందని, ఐటీ సంస్థలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సైబర్ సమస్యలపై హైదరాబాద్ కేంద్రంగా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఇవాళ గూగుల్ ప్రతినిధులు ఆయనతో భేటీ అయ్యారు. ఈ మేరకు జీఎస్‌ఈసీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ కంపెనీ కీలక ఒప్పందం చేసుకుంది.
ఈ సందర్భంగా గూగుల్ సీఐఓ రాయల్ హన్సెన్, అరిజిత్ సర్కార్, శ్రీనివాస్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ ఐటీ కంపెనీలు ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్నాయని గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, అమెజాన్, మెటా సంస్థల ప్రధాన కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేశాయని రేవంత్ రెడ్డి అన్నారు. సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటు వల్ల వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయని, గ్లోబర్ హబ్‌గా మారేందుకు హైదరాబాద్‌కు అన్ని అవకాశాలున్నాయని గూగుల్ సీఐఓ రాయల్ హన్సెన్ వెల్లడించారు.
దేశంలోనే మొట్టమొదటిది : సైబర్, డిజిటల్ సెక్యూరిటీ, సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ అనుకూల ప్రాంతమని రాయల్ హన్సెన్ తెలిపారు. దేశంలోని మొట్టమొదటి సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు గూగుల్ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో స్థాపించే సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ప్రపంచంలోనే ఐదోవది కాగా ఏషియా పసిఫిక్ జోన్‌లో టోక్యో తర్వాత రెండోది కావడం గమనార్హం.