Book Fair in Hyderabad : ప్రతి ఏటా హైదరాబాద్ వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే హైదరాబాద్ బుక్ ఫెయిర్ నేడు అట్టహాసంగా ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ 37వ పుస్తక ప్రదర్శన ఇందిరా పార్క్ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈరోజు నుంచి ఈ నెల 29 వరకు ఉంటుందని బుక్ ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్ షేక్ ప్రకటించారు. బుక్ ఫెయిర్‌లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం అంతటి నుంచి 210కి పైగా ప్రచురణ కర్తలు, పంపిణీదారులు తమ పుస్తకాలను ప్రదర్శిస్తారని వెల్లడించారు.
ప్రారంభానికి సీఎం రేవంత్ రెడ్డి : సందర్శకులకు, పెద్ద వాళ్లకు సౌకర్యంగా ఉండే స్టాళ్లల్లోని పుస్తకాలను ఆహ్లాదకరమైన వాతావరణంలో చూసే విధంగా బుక్ ఫెయిర్‌లో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, తమిళం, సంస్కృతం, ఉర్దూ, మరాఠీ, కన్నడ భాష పుస్తకాలు లభ్యమవుతాయని అన్నారు. అన్ని వర్గాల వారు బుక్ ఫెయిర్‌ను సందర్శించి విజయవంతం చేయాలని కోరారు. పుస్తక ప్రదర్శనలో స్టాల్ ఏర్పాటు చేయాలనుకునే వారు ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని బుక్ ఫెయిర్ సొసైటీ ఇప్పటికే సూచించింది.
నిజానికి హైదరాబాద్‌లో చాలా మంది ఆత్రుతగా ఎదురు చూసే వాటిలో ఈ పుస్తక ప్రదర్శన ఒకటి. దీని కోసమే జిల్లాల నుంచి కూడా వచ్చేవారు ఉన్నారని యాకూబ్ షేక్ తెలిపారు. ఈసారి కేంద్ర సాహిత్య అకాడమీ సైతం భాగస్వామ్యం అవుతోందన్నారు. పుస్తక ప్రదర్శన ప్రతిష్ఠ పెంచేలా, బుక్ ఫెయిర్‌ను విజయవంతం చేసేలా చూడాలన్నారు. ప్రస్తుత రోజుల్లో విద్యార్థులు పుస్తకాలు చదవకపోవడం కొంత బాధ కలిగించే అంశమేనని సభ్యులు తెలిపారు. సొసైటీ అధ్యక్షుడు యాకూబ్ మాట్లాడుతూ గతంలో పుస్తక ప్రదర్శన మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే ఉండేదని, ఈసారి మాత్రం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.