Gold Price in Telangana Today :రోజురోజుకు బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి అమాంతం కొండెక్కింది. 24 క్యారెట్ల మేలిమి పసిడి ధర 10 గ్రాములకు 67 వేల రూపాయలు ఉంది. దీన్ని ఆభరణంగానే కాకుండా పెట్టుబడిగా భావించడం కూడా పెరుగుదలకు ఒక కారణం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ వల్ల కూడా ధరలు పెరుగుతున్నాయి.
యూఎస్(US) ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గిస్తుండటం, ఆర్థిక అనిశ్చితి నెలకొనడం కూడా బంగారం పెరుగుదలకు కారణం. కేవలం నెల రోజుల వ్యవధిలోనే 10 గ్రాముల బంగారంపై 2 వేల రూపాయల వరకు పెరిగింది. జూన్‌లో మరోసారి ఫెడ్ పాలసీ విడుదలైతే మరికొంత పెరిగే అవకాశం ఉంది. ధర పెరిగినా వినియోగదారుల కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు.
'బంగారం ధర పెరుగుతోంది కానీ ప్రస్తుతానికి తగ్గే ప్రసక్తే అయితే కనిపిస్తలేదు. ఒక అడుగు వెనక్కి పడినా గ్యారెంటీగా రెండు, మూడు అడుగులు ముందుకే వెళ్తుంది. మీరు గమనించినట్లయితే ఫిబ్రవరి 5వ తేదీ ధరకు ఇవాల్టి ధరకు 2 వేల తేడా ఉంది. ప్రజల్లో ఉండే కొంత అవగాహన మారింది. ఇంతకముందు ప్రజలు కేవలం పెళ్లిళ్లకు కొనుగోలు చేస్తే, ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్లాగా చూస్తున్నారు. ఆదాయం కింద బంగారం తీసుకుని, ఎప్పుడైనా కావాలంటే లాభం పొందవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. ఇది సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక ఆలోచన ధోరణి వచ్చింది. దీని వల్ల బంగారానికి డిమాండ్ పెరిగింది.' - ప్రతాప్, బులియన్ మార్కెట్ నిపుణులు