Second Alert remove in Bhadrachalam :భద్రాచలం వద్ద గోదారమ్మ శాంతించింది. శనివారం రాత్రి వరద ఉద్ధృతి 53 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆదివారం ఉదయం 7 గంటలకు 52.8 అడుగులకు తగ్గడంతో మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ఇవాళ రాత్రి 9 గంటలకు 47.8 అడుగులకు తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరిక విరమించారు. 43 అడుగుల కంటే తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరికను కూడా తొలగిస్తారు.
గోదావరి శాంతించినప్పటికీ ఇంకా లోతట్టు ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. భద్రాచలం పట్టణంలోని కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీల్లో వరదనీరు చేరింది. ఈ రెండు కాలనీలలో బాధితులు స్థానిక కుర్రాజుల గుట్టలోని కొండరావు కేంద్రంలో తలదాచుకుంటున్నారు. భద్రాచలం నుంచి చింతూరు వెళ్లే ప్రధాన రహదారిలో స్థానిక శిశు మందిరం వద్ద రోడ్డుకు అడ్డుగా కట్ట ఏర్పాటు చేశారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలో గోదావరి ఘాట్ల వద్ద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో భక్తులను స్నానాలకు అనుమతించడం లేదు. 43 అడుగుల కంటే వరద నీటిమట్టం తగ్గితే సాధారణ పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.