GHMC Surveillance Vehicle For Garbage :హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో ఎక్కడ చూసినా చెత్త దర్శనం ఇస్తుంటుంది. చెత్త వేయరాదు, వేసిన వారికి జరిమానా అని రాసి ఉంచినా, ఎవరూ చూడట్లేదు కదా అని వేసి వెళ్లిపోతారు. తెల్లవారుజామున, అర్ధరాత్రుళ్లు ఎవరూ చూడటం లేదని చెత్తని వేసి వెళ్లిపోతుంటారు. ఇలాంటి వారికి కళ్లెం వేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు కొత్త ప్లాన్ వేశారు. ఎవరూ చూడడం లేదని చెత్తను వేసే వారిని ఇకపై నిఘా వాహనాలు ఫొటోలు తీసి, హెచ్చరిస్తాయి.
ఈ సేవలను గురువారం జీహెచ్‌ఎంసీ ఎల్బీనగర్ జోన్‌లోని ఉప్పల్ సర్కిల్‌లో ఆ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ కింద కొత్తగా నిఘా వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. దానికి సీసీ కెమెరా, మైకు రెండు అమర్చి ఉంటాయి. రోడ్లపై చెత్త వేసే వారిని గుర్తించి, వారి ఫొటో తీయడం ఈ వాహనానికి ఉన్న స్పెషాలిటీ. అలా చెత్త వేస్తున్న వారు కెమెరాకు చిక్కితే మైకు మోగుతుంది. 'రోడ్లపై చెత్తవేయరాదు, చేసిన తప్పునకు మూల్యం చెల్లించుకోవాల్సిందే' అంటూ హెచ్చరిస్తుంది. వెంటనే సిబ్బంది ఉల్లంఘనులకు జరిమానా వేస్తారు. తద్వారా ప్రజల్లో మార్పు తీసుకొస్తామని సర్కిల్ కార్యాలయం తెలిపింది.
డ్రైనేజ్ పక్కనే కిచెన్, ఫ్రిజ్లో కుళ్లిన మటన్ - తనిఖీ చేస్తూ షాకైన మేయర్