Gambling is Rampant in Borders of Anakapalle And Alluri District :పది నుంచి ఇరవై మంది వరకు ఊరవతల తోటల్లో చేరుతారు. ఒక్కొక్కరు రూ.1000 చొప్పున పందెం కడతారు. ఆ డబ్బంతా బరిలో ఉంచుతారు. వరుసలో ఒకరి తరువాత మరొకరు రెండు నాణేలను పైకి ఎగురవేస్తారు. నేలపై రెండు బొమ్మలు ఎవరికి పడితే ఆయనే విజేత. బరిలో సొమ్మంతా అతడికే చెందుతుంది. చాపకింద నీరులా విస్తరించుకుపోతున్న ఈ జూదాన్ని నియంత్రించడం పోలీసులకు ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది.
చిత్తులాట లేదా ఏటులాటగా ఈ జూదాన్ని వ్యవహరిస్తున్నారు. కొందరు కాయిన్స్ గేమ్‌గా పిలుస్తున్నారు. కొద్దిరోజుల క్రితం గొలుగొండ మండలం అమ్మపేట సమీపంలోని తోటల్లో జరుగుతుందని తెలిసి పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఆ సమయంలో కొందరు పరారు కాగా నలుగురు దొరికిపోయారు. నర్సీపట్నం సమీపంలోని జోగునాథునిపాలెం వద్ద ఓ ప్రైవేటు లే-అవుట్లో ఏటులాట జరుగుతుందని నిఘా పోలీసులు అటువైపు వెళ్లారు. వీరొస్తున్నట్టు దూరం నుంచే గమనించి అందరూ పరారయ్యారు. నాణేలు ఎగురవేసే ఆట అనకాపల్లి-అల్లూరి జిల్లా సరిహద్దుల్లో జోరుగా సాగుతోంది. లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. గొలుగొండ- కొయ్యూరు మండలాల సరిహద్దుల్లో బాలారం-చోద్యం మధ్య తోటల్లో తరచూ జూదం నిర్వహిస్తున్నారు. పలు మండలాల నుంచి జూదరులు వస్తున్నారు.
నర్సీపట్నం టౌన్ స్టేషన్ పరిధిలోని ఉత్తరవాహిని ప్రాంతం, షణ్ముఖనగర్, గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలోని వేములపూడి శివార్లలో అప్పుడప్పుడు ఈ జూదం జరుగుతోందని సమాచారం. కూడలిలో కొన్ని దుకాణాలు, చెట్ల కింద బైకులు నిలిపేసి జూదరులు తోటల్లోకి వెళుతుంటారు. పోలీసులు లేదా అనుమానాస్పద వ్యక్తులెవరైనా ఇటువైపు వస్తుంటే గమనించి సమాచారం ఇచ్చేందుకు అన్ని దారుల్లో కూలీలను కాపలా ఉంచుతున్నారు. వీరికి రోజుకు రూ.600 కూలి, బిర్యానీ పొట్లం ఇస్తున్నారు. గంటల వ్యవధిలోనే ఆట ముగించి జారుకుంటారు. ఈ నెల 18న అమ్మపేటలో అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల, కొయ్యూరు మండలం బాలారం, మాకవరపాలెం మండలం వజ్రగడ, గొలుగొండ మండల చోద్యానికి నలుగురు నాణేల ఆట ఆడుతూ పట్టుబడ్డారు. ఆటకు వినియోగించే నాణేలు, రూ.7వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.