Sankranti Bommala Koluvu 2025 : సంప్రదాయాల పండగ సంక్రాంతికి తెలుగు లోగిళ్లు రంగవల్లులతోపాటు బొమ్మల కొలువులతోనూ కళకళలాడుతున్నాయి. ఇందులో పురాణ ఘట్టాలను జ్ఞప్తికి తెచ్చేలా బొమ్మల్ని అమర్చడం అనాదిగా వస్తుంది. ఈ వేడుకను విజయవాడలోని ఓ మహిళ తన ఇంట్లోని బొమ్మలతో త్రిలోకాలను ఏర్పాటు చేసి మురిసిపోయింది. 64 కళలను వివరించేలా ఏర్పాటు చేసిన ఆ బొమ్మల కొలువు విశేషాలేంటో మనం ఇప్పుడు చూద్దాం.
పురాణ విశేషాలు, ఆచారాలు వ్యవహారాలు, సంస్కృతిని భవిష్యత్ తరాలకు తెలియచెప్పే లక్ష్యంతో వచ్చిన సంప్రదాయమే బొమ్మల కొలువు. ఈ బొమ్మల కొలువు పెట్టడం కేవలం భక్తిప్రధానమే కాక, విజ్ఞానదాయకంగా, వినోదాత్మకంగా, సంస్కృతీ సంపన్నమై సంప్రదాయ పరిరక్షణతో పాటు కళాత్మక దృష్టినీ పెంపొదిస్తుంది. విజయవాడలోని ఓ కుటుంబం ఈ సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ సంక్రాంతికి బొమ్మల కొలువును ఏర్పాటు చేసింది.
30 సంవత్సరాల నుంచి శిష్ట్లా రామకృష్ణ కుటుంబం బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాదికి 'మన బ్రహ్మాండం' అనే థీమ్‌తో శ్రీచక్రం త్రీడీ మోడల్, 102 ఖడ్గమాల దేవీ, త్రిలోకాలైన దేవలోకం, భూలోకం, పాతాళ లోకాలను బొమ్మల రూపంలో ప్రదర్శించారు. అండం నుంచి బ్రహ్మాండం వరకూ అనే వివరాలు తెలియచెప్పేలా శ్రీచక్రం ఖడ్గమాల ఏర్పాటు చేశామని వారు తెలిపారు. ఇందుకోసం చాలా పుస్తకాలు కూడా చదివానని చెబుతున్నారు బొమ్మల కొలువు ఏర్పాటు చేసిన విజయశ్రీ.
"బొమ్మల కొలువును 30 సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో వీటిని ఏర్పాటు చేస్తున్నాం. శ్రీచక్రం త్రీడీ మోడల్, 102 ఖడ్గమాల దేవీ, త్రిలోకాలైన దేవలోకం, భూలోకం, పాతాళ లోకాలను బొమ్మల రూపంలో ప్రదర్శించాం. అమ్మవారి అర్చన 64 విధానాలని చెబుతారు. అందులోని 64 కళలకు సంబంధించి బొమ్మలను తయారుచేశాను. ఈ బొమ్మలన్నీ చేతితో నేనే తయారుచేశాను." - శిష్ట్లా విజయశ్రీ, విజయవాడ
Sankranti celebrations in AP 2025 : 64 కళల్లో ఈ బొమ్మల కొలువు కూడా ఉందని ఈ విశేషాలను భవిష్యత్ తరాలకు తెలియచెప్పే ఉద్దేశంతోనే ఏర్పాటు చేశామని విజయశ్రీ తెలిపారు. పుస్తకాల్లో చదివేకంటే ఇలా బొమ్మల రూపంలో ఉంటే త్వరగా మనస్సును హత్తుకుంటుందని స్పష్టం చేశారు. కొలువులో పెట్టిన బొమ్మలన్నీ చేతితో తయారు చేశానని ఆమె పేర్కొన్నారు. ఆనవాయితీగా చేస్తున్న బొమ్మల కొలువుకు విశేష స్పందన లభిస్తోందని విజయశ్రీ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.