Gac Fruit Farming In Telugu States :ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనూ రైతన్నలు సరికొత్త పంథాలో పండ్ల తోటలు సాగుచేస్తూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. అందరికంటే భిన్నంగా ఆలోచించాడు ఏలూరుకు చెందిన యువరైతు. 'ఫ్రూట్ ఫ్రం హెవెన్' అని పిలిచే ఆ పండును తెలుగు రాష్ట్రల్లో పండిస్తూ తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం అందుకుంటున్నాడు ఈ రైతు. మరి, ఆ అరుదైన పండ్ల జాతి ఏమిటి? దాన్ని ఎలా పండిస్తున్నారో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.
గ్యాక్ ఫ్రూట్ పంటలు : రంగులో నారింజలా, ఆకారంలో చిన్నపాటి పనసలా కనిపిస్తున్న ఈ పండు పేరు గ్యాక్ ఫ్రూట్. ఈ పండు అధిక పోషకాలను అందిస్తుంది. ఔషధ తయారీలో అధికంగా ఈ ఫ్రూట్‌ని ఉపయోగిస్తారు. ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా ఈ పండు రైతుకు ఆదాయం అందిస్తుంది. అది గ్రహించిన ఈ యువరైతు విదేశాలకే పరిమితమైన గ్రేట్ అమెరికన్ కంట్రీ పంటను తెలుగు రాష్ట్రాల్లో పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు.
ఏపీలోని ఏలూరు జిల్లా మామిడిగొంది గ్రామంలో వెంకటేశ్ నివసిస్తున్నాడు. అదే గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. రకరకాల మొక్కలు పెంచడమంటే ఇతనికి చాలా ఇష్టం. అదే ఇష్టంతో గ్యాక్ ఫ్రూట్ గురించి తెలుసుకున్నాడు. వెంటనే మొక్కలు తెచ్చి ఇక్కడ పంట సాగుచేస్తున్నాడు.
మనం ఏ వృత్తిలో ఉన్నా అభిరుచిని మరవొద్దు అంటున్నాడు వెంకటేశ్. అందుకోసం ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో 50 రకాల పండ్ల మొక్కలను పెంచుతున్నాడు. ఈ క్రమంలోనే విదేశాల్లో ఆదరణ పొందిన గ్యాక్ ఫ్రూట్‌ని పండించాలని నిశ్చయించుకున్నాడు. కేరళలో ఓ రైతు ఈ పంట పండిస్తున్నాడని తెలసుకొని అతడి ద్వారా మొక్కలు సేకరించాడు. అనంతరం అనేక పరిశోధనలు చేసి 2023లో గ్యాక్ ఫ్రూట్ సాగుచేయడం మొదలుపెట్టాడు.