తెలంగాణ

telangana

ETV Bharat / state

చెరువుల కబ్జాలకు ఇక నుంచి ఫుల్​స్టాప్!​ - అంగుళం ఆక్రమించినా ప్రభుత్వానికి తెలిసిపోద్ది!! - WATER RESOURCES IN HYDERABAD

చెరువుల విస్తీర్ణం, బఫర్​ జోన్​ వివరాలు హెచ్​ఎండీఏ వెబ్​సైట్​లో - మొత్తం చెరువులు 1047 - సర్వే చేయడానికి గుర్తించినవి 981

LAKES SURVEY IN HYDERABAD
LAKES IN HYDERABAD CITY (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2024, 1:48 PM IST

Lakes in Hyderabad : చెరువులు, కుంటలను ఎవరూ ఆక్రమించకుండా రంగారెడ్డి జిల్లా రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు పకడ్బందీగా లెక్కలు సిద్ధం చేస్తున్నారు. చెరువుల నక్ష, డిజిటల్‌ సర్వేల సహాయంతో వాటి విస్తీర్ణాన్ని, ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్​ లెవల్), బఫర్‌జోన్‌ను నిర్ణయిస్తున్నారు. ప్రతి చెరువుకు సంబంధించిన అంశాలను జియో ట్యాగ్‌ ఏర్పాటు చేసి హెచ్‌ఏండీఏ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1075 చెరువులుండగా, 107వి పూర్తి చేసి హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. సమన్వయంతో మిగిలిన వాటి తుది సర్వే పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.

బఫర్​జోన్​లలో విల్లాలు :రెవెన్యూ అధికారుల సర్వేలో చెరువుల సమీపంలో వెంచర్లు వేసినవారు, రియల్‌ ఎస్టేట్​ సంస్థల ప్రతినిధులు, బహుళ అంతస్తుల భవనాలు నిర్మించినవారిలో కొందరు బఫర్‌జోన్లలో కొన్ని స్థలాలను ఆక్రమించుకున్నట్లు గుర్తించారు. వెంచర్లు, బహుళ అంతస్తుల ప్రహరీలు ఎంత పొడవున్నాయో అంత, దాదాపు పదడుగుల నుంచి ఇరవై అడుగుల వెడల్పు ప్రాంతాన్ని కలిపేసుకున్నారు.

ఇలాంటి ఆక్రమణలు ఎక్కువగా శేరిలింగంపల్లి, గండిపేట, రాజేంద్రనగర్, శంషాబాద్‌ మండలాల్లో ఉన్నాయని సర్వే అధికారుల పరిశీలనలో తేలింది. యాభైకి పైగా చెరువుల ఎఫ్‌టీఎల్‌,బఫర్‌జోన్​లను కొందరు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు మార్చేసి నిర్మాణాలు చేపట్టారు. గండిపేట మండలంలో ఓ వ్యక్తి బఫర్‌జోన్‌లో విల్లాలు నిర్మించగా వాటిని అధికారులు కూల్చేసి కొత్తగా బఫర్‌ జోన్‌ హద్దులను ఏర్పాటుచేశారు. శేరిలింగంపల్లిలో ఓ రియల్‌ ఎస్టేట్​ సంస్థ ముప్పై అడుగుల వెడల్పుతో 750 మీటర్ల పొడవు చెరువు బఫర్‌ జోన్‌ను తమ ప్రహరీలో కలిపేసుకుంది.

ప్రత్యేక బృందాల ఏర్పాటు : ఆక్రమించిన జల వనరులు, చెరువుల భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక బృందాలను రెవెన్యూ అధికారులు నియమించారు. ఈ బృందాల్లో రెవెన్యూ, మున్సిపల్‌, ఇరిగేషన్, హైడ్రా అధికారులు ఉన్నారు. వీరు రియల్‌ వెంచర్ల సమీపంలోని చెరువులపై దృష్టి కేంద్రీకరించే పనిలో ఉన్నారు. రెండుమూడు రోజులకోమారు ఆయా ప్రాంతాలకు వెళ్లి చెరువులను పరిశీలించనున్నారు. ప్రాధాన్య ప్రాంతాల్లోని చెరువుల్లో కొన్నింటికి సీసీ కెమెరాలతో సైతం నిఘా ఏర్పాటుచేశారు. వెబ్‌సైట్‌లోని వివరాలతో పాటు ప్రతి చెరువు పరివాహక ప్రాంతాన్ని జియో ట్యాగింగ్‌ చేయనున్నారు. దీంతో, చెరువును ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే వెంటనే అధికారులకు తెలిసిపోతుంది.

  • రంగారెడ్డి జిల్లాలో మొత్తం చెరువులు 1075
  • సర్వే చేయడానికి గుర్తించినవి 981
  • ప్రాథమిక సర్వే పూర్తయినవి 894
  • తుది సర్వే పూర్తయినవి 107

హైడ్రా కీలక నిర్ణయం - నివాసాల మధ్య ఉన్న చెరువులపై నజర్

హైదరాబాద్‌ చెరువులకు మహర్దశ! - మంచినీటి జల వనరులుగా తీర్చిదిద్దనున్న హైడ్రా

ABOUT THE AUTHOR

...view details