Free Yoga Training in Kurnool: కర్నూలు నగరానికి చెందిన యోగా గురువు పెరుమాళ్ల దత్తయ్య గత 34 సంవత్సరాలుగా ఉచితంగా యోగా నేర్పిస్తున్నారు. కర్నూలులోని వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో శిష్యులకు యోగా నేర్పిస్తున్నారు. తన వద్దకు వచ్చిన వారికి యోగా వల్ల కలిగే ప్రయోజనాలు చెబుతూ వారితో యోగా సాధన చేయిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారు ఆరోగ్యవంతులై వయస్సుతో సంబంధం లేకుండా వారు ఆనందంగా గడుపుతున్నారు.
యోగాను పతాంజలి మహర్షి కనుగొన్నా, ప్రపంచ వ్యాప్తంగా యోగాకు మాత్రం గుర్తింపు తెచ్చింది ప్రధానమంత్రి నరేంద్రమోదీనేని యోగా గురువు పెరుమాళ్ల దత్తయ్య అంటున్నారు. యోగా చేస్తే మనస్సు, శరీరం ఉత్సాహంగా ఉంటాయని, ఎలాంటి రోగాలు దరిచేరవని అంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు ప్రతిరోజు గంట సమయం యోగా చేయాలని వారు కోరుతున్నారు.
"పది మందికి యోగా నేర్పించాలి అనే సంకల్పంతో ఉచితంగా సేవ చేస్తున్నాను. నేను ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోవడం లేదు. యోగా చేయడం వలన మనకి ఒత్తిడి అనేది బాగా తగ్గిపోతుంది. కండరాలకి, ఎముకలకి, మైండ్‌కి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ప్రాణాయామం చేస్తే మైండ్ చాలా బాగా పనిచేస్తుంది. అదే విధంగా ఆసనాలు చేస్తే శరీర ఆకృతి బాగుటుంది. మెడిటేషన్ చేస్తే శరీరం, మైండ్ రెండూ కూడా సమస్థితికి వచ్చేస్తాయి". - పెరుమాళ్ల దత్తయ్య, యోగా గురువు