Free Bus Service Impact On Deluxe Bus :రాష్ట్రంలో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు వీలున్న ఎక్స్‌ప్రెస్ బస్సులను అవసరాలకు తగ్గట్టుగా ఆర్టీసీ పెంచడం లేదు. డబ్బులు చెల్లించి పూర్తి టికెట్ కొనాల్సిన డీలక్స్ బస్సులవైపు వారిని మళ్లించేందుకు కొన్నిచోట్ల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే డీలక్స్ బస్సు ఎక్కితే మహిళలకు బహుమతులు ఇస్తామంటూ కొత్త స్కీంను ఆర్టీసీ ప్రారంభించింది. హనుమకొండ - హైదరాబాద్ మార్గంలో జనగామ డిపో 3 డీలక్స్ బస్సులను ప్రవేశపెట్టింది. ఈ బస్సుల్లో ప్రయాణిస్తే ప్రతి 15 రోజులకు ముగ్గురు మహిళలకు గిఫ్ట్లు ఇస్తామని ప్రకటించింది.
Occupancy Rate In Buses :ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో గతంలో సగటున 70-75 శాతం వరకు మాత్రమే ఉండేది. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వచ్చాక దాదాపు వంద శాతం నమోదవుతోంది. కేవలం ఎక్స్‌ప్రెస్ బస్సులనే పరిగణనలోకి తీసుకుంటే 120 శాతం దాటుతోంది. ఆర్డినరీ బస్సుల్లో కంటే ఎక్స్‌ప్రెస్‌లో సీట్లు కొంత మెరుగ్గా ఉంటాయి. వీటిలో బస్సు వేగం కూడా అధికం. ఆగే స్టాపులు, ప్రయాణానికి సమయం కూడా తక్కువ పడుతుంది.
ఈ కారణంగానే మహిళలు ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశం ఆర్టీసీకి ఆర్థికంగా సమస్యగా మారింది. రోజువారీ నిర్వహణ ఖర్చులు, డీజిల్, ఉద్యోగులకు నెల జీతాలకు ఇబ్బంది అవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ మార్పులు చేయడానికి ప్రయత్నిస్తోంది.
పలు అంతర్గత, అంతర్రాష్ట్ర సర్వీసుల రద్దు :దూర ప్రాంత సర్వీసుల్ని రద్దు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి డిపో మేనేజర్లకు కొంతకాలం క్రితమే అంతర్గత ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పలు అంతర్ జిల్లా, అంతర్రాష్ట్ర సర్వీసులను రద్దు చేశారు. జనగామ నుంచి బాసర మార్గంలో 30 ఏళ్లుగా ఎక్స్‌ప్రెస్ బస్సుంది. ఉచిత ప్రయాణ పథకం వచ్చిన తర్వాత బస్సులో రద్దీ విపరీతంగా పెరిగింది.