Fraud in The Name of Marriage in Hyderabad : వారికి ఒక్కగానొక్క కూతురు. తను ఉన్నతవిద్య పూర్తి చేసింది. ఇక పెళ్లి చేద్దామనుకున్నారు. మ్యాట్రిమోనీ ద్వారా ఒక యువకుడి ప్రొఫైల్ నచ్చింది. అన్నీ కుదిరాయి బాజాభజంత్రీలు మోగిద్దామనుకున్నారు. పెళ్లిచూపుల తంతు పూర్తవగానే ఆ అబ్బాయి గొంతెమ్మ కోర్కెలు విని పెళ్లికూతురు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అయినప్పటికీ కాబోయే అల్లుడే కదా తానా అంటే తందానా అన్నట్లు అన్నింటికీ అంగీకరించారు.
కొద్దిరోజులకే ఆభరణాలు, వివాహ ఖర్చులంటూ రూ.25 లక్షలు తీసుకున్నాడు. నమ్మించడం కోసం తాను కొంటున్న నగలను వాట్సాప్‌లోనూ పంపాడు. ఇంతలోనే పెళ్లి పనుల్లో నిమగ్నమైన వధువు ఇంటి వారికి ఊహించని షాక్ తగిలింది. అప్పటికే అతడికి పెళ్లైందని, కొన్ని సార్లు జైలుకు కూడా వెళ్లొచ్చినట్టు తెలిసింది. వెంటనే పెళ్లి రద్దు చేసి డబ్బు తిరిగివ్వమంటే ముఖం చాటేశాడు. అయినా ఊరుకోకుండా గట్టిగా నిలదీస్తే చెక్కులిచ్చాడు.
అవి చెల్లకపోవడంతో వధువు తరుపు వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. అప్పుడే అతడి గురించి మరిన్ని విషయాలు తెలిశాయి. నిందితుడు ఎంతోమంది యువతులను ఇలా మాయ చేస్తున్నాడని తెలిసి వారు విస్తుపోయారు. అతడు ఏం చదివాడో ఎవరికీ తెలియదు గానీ మాయమాటలతో బురిడీ కొట్టించడంలో పీహెచ్‌డీ చేశాడు. తాజాగా సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇతడి ఆగడాలకు కళ్లెం వేసేందుకు తెలుగు రాష్ట్రాల్లో నమోదైన కేసుల చిట్టా వెలికి తీస్తున్నారు.