తెలంగాణ

telangana

ETV Bharat / state

పైన దుబాయ్ కరెన్సీ, లోన తెల్ల కాగితాలు - మార్చిపెట్టాలని మోసం - FRAUD IN THE NAME OF DIRHAM

దుబాయ్‌ కరెన్సీ దిర్హమ్‌ పేరుతో మోసం - ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు

INTER STATE GANG IN HYDERABAD
FRAUD IN THE NAME OF DIRHAM (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 7, 2024, 3:54 PM IST

Illigal Money Transfers in hyderabad : హైదరాబాద్‌ నగరంలో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ముగ్గురిని రాంగోపాల్‌పేట్‌ పోలీసులు రిమాండుకు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ నర్సింగ్‌రావు కథనం ప్రకారం నార్త్‌ ఈస్ట్‌ దిల్లీకి చెందిన మహ్మద్‌ సాహిదుల్‌(25) ఆటోడ్రైవర్‌. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన రఫీక్‌ అహ్మద్‌(30), రూబీ(23) కూలీలు. వీరంతా కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఆరాంఘర్‌కు సమీపంలోని నెహ్రూ జూపార్కు ప్రాంతంలోని బస్తీలో నివాసం ఉంటున్నారు.

గత నెల (నవంబర్‌) 29న మహ్మద్‌ సాహిదుల్‌ సంతోష్‌నగర్‌లో ఓ బేకరీ నిర్వహిస్తున్న అఖిల్‌ అనే వ్యక్తి వద్దకు వెళ్లి తాను దుబాయ్‌ నుంచి వచ్చానని తన ఆంటీ ఆసుపత్రిలో ఉందని చెప్పాడు. ఎలాగైన కరెన్సీ మార్పించి ఇవ్వాలని దుబాయ్‌ కరెన్సీ అయిన దిర్హామ్‌ నోటు అతడికి ఇచ్చాడు. అఖిల్‌ ఇది చూసి ఆ నోటును మనీ ట్రాన్స్‌ఫర్‌ సంస్థలో ఇవ్వగా రూ.200లు ఇచ్చారు. ఇలాంటివి తన వద్ద మరో వంద దిర్హామ్స్ ఉన్నాయని వీటిని మార్పించే ఈ ఒక్క సహయం చేయమని సాహిదుల్‌ కోరాడు. కమిషన్‌కు ఆశపడిన అఖిల్‌ రూ.లక్షా 50వేలకు అతనితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నెల డిసెంబర్‌ 1న అఖిల్‌ తన భార్యతో కలిసి సాహిదుల్‌ వద్దకు వెళ్లాడు.

దిర్హమ్స్‌తో మోసం : సాహిదుల్‌ పేపర్లలో చుట్టి ఉంచిన కట్టను చూపించాడు. ఆ పేపర్‌ కట్టలో పైన దిర్హామ్‌ కనిపించడంతో అఖిల్‌ పూర్తిగా నమ్మాడు. కట్టను చేతిలో పెట్టి వెంటనే వెళ్లిపోవాలని సాహిదుల్‌ వారికి చెప్పాడు. లేదంటే పోలీసులు వస్తారని, వారికి పట్టుబడితే అందరం లోపలకు పోతాం అని భయానికి గురి చేశాడు. అనంతరం అఖిల్‌ నుంచి నగదు తీసుకొని సాహిదుల్‌ వెంటనే ఉడాయించాడు. కొంతదూరం వెళ్లిన అఖిల్‌ దంపతులు దిర్హమ్స్‌ ఉన్న పేపర్ల కట్టను విప్పిచూడగా పైన ఒకే ఒక్క దిర్హమ్‌ నోటు ఉండగా మొత్తం తెల్ల కాగితాలే ఉన్నాయి.

వాటిని చూసి అఖిల్‌తో పాటు తన భార్య కూడా అవాక్కయ్యారు. సాహిదుల్‌ చేతిలో మోసపోయినట్లుగా తెలుసుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3 లక్షల 50వేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్‌లో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

బై బ్యాక్ ఇన్వెస్ట్​మెంట్ అంటూ మోసం చేశారు - సువర్ణ భూమి ఎండీపై బాధితుల ఫిర్యాదు

భార్య.. భర్త.. ఓ దోపిడీ - పోస్టాఫీసులో ఉద్యోగ దంపతుల భారీ మోసం

ABOUT THE AUTHOR

...view details