Venkaiah Naidu Paid Tribute to Ramoji Rao: అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రామోజీ రావు ఒక వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ అని కొనియాడారు. హైదరాబాద్లోని ఫిలిం సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం రామోజీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా రామోజీతో తనకున్న బంధాన్ని వెంకయ్య గుర్తు చేసుకున్నారు. స్వయంకృషితో కష్టపడిన రామోజీఅనేక రంగాల్లో విజయం సాధించారని గుర్తు చేశారు. ఆయన ఒక ధ్రువతారలా నిరంతరం వెలుగుతూ ఉంటారని తెలిపారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు భవిష్యత్తు తరాలకు ఆదర్శమని, రామోజీరావు ఒక పోరాట యోధుడని పేర్కొన్నారు. అనంతరం తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. నిత్యం ఉషోదయంతో అక్షర కిరణాలను తెలుగు లోగిళ్లకు పంపి, సమాజాన్ని జాగృతం చేసిన అక్షర క్రాంతి రామోజీరావు అని వెంకయ్యనాయుడు అన్నారు.
"రామోజీరావు ప్రతి మాట, ప్రతి చేత సమాజం పక్షమే వహించింది. సరైన సమయంలో దిశానిర్దేశం చేసింది. సమసమాజ నిర్మాణం దిశగా జాతిని జాగృతం చేసింది. భౌతికంగా వారు మనకు దూరమైనా, వారు నిర్మించిన బాటలు భవిష్యత్ తరాలను ప్రభావవంతమైన మార్గంలో ముందుకు నడుపుతూనే ఉంటాయి. వ్యాపార రంగంలో రామోజీ రావు నూతన ఆలోచనా విధానాలు, పాటించిన విలువలు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. అమ్మకాలు, కొనుగోళ్లు మాత్రమే కాదు అంతకు మించిన సామాజిక బాధ్యతను గుర్తు చేశాయి. తెలుగు సినిమా రంగానికి విలువల దివిటీ పట్టి వారు చూపించిన నూతన మార్గం ఎంతో మంది నూతన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కొత్త జీవితాన్ని ఇచ్చింది." - వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి