Warangal Ex MLA Name in Ration Card List :వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో బుధవారం ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. నాలుగు సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను కార్యదర్శి ధర్మేందర్ చదివి వినిపించారు. అనంతరం రేషన్ కార్డుల జాబితాను పరిశీలించగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరుతో దరఖాస్తు (ఐడీ నెం.18608965) కనిపించింది. దీంతో మాజీ ఎమ్మెల్యే రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడమేంటని స్థానికులు ఆశ్చర్యపోయారు. ఆ దరఖాస్తు పెద్ది సుదర్శన్‌రెడ్డి చిరునామాతో కూడిన ఇంటి నెంబరు (6-86), లెంకాలపల్లి రోడ్డు, నల్లబెల్లి పేరుతో ఉంది. ఫోన్ నంబరు సైతం ఆయనదే ఉంది.
ఈ దరఖాస్తు ఆన్‌లైన్‌లో చేసినట్లు తెలిసింది. పెద్ది సుదర్శన్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే కావడంతో దరఖాస్తు తిరస్కరిస్తామని అధికారులు తెలిపారు. గతంలో పౌరసరఫరాల శాఖ ఛైర్మన్‌గా, ఎమ్మెల్యేగా పదవులు అనుభవించిన ‘పెద్ది’ పేరుతో రేషన్‌కార్డు దరఖాస్తు ఉండటం చర్చనీయాంశంగా మారింది. నల్లబెల్లి మండలం నుంచి 85 దరఖాస్తులు మీసేవ ద్వారా వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని వివరణ కోరగా తాను దరఖాస్తు చేయలేదని స్పష్టం చేశారు. జాబితాలో తన పేరు ఎలా వచ్చిందో అధికారులకే తెలియాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు : రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు మూడోరోజు జరుగుతున్నాయి. రేపటితో సభలు ముగయనుండగా ప్రజలు దరఖాస్తులు ఇస్తున్నారు. కానీ హైదరాబాద్‌లో మాత్రం ఇంకా సభల ఊసేలేదు. నగరంలో రేషన్ కార్డుల మంజూరులో జాప్యం జరుగుతుంది. అన్ని జిల్లాల్లో మాదిరే గణతంత్ర దినోత్సవం రోజున హైదరాబాద్‌లో రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.