KTR and Harish Rao to DGP about Police action on Youth :రాష్ట్ర యువతపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా డీజీపీ జితేందర్‌కు పలు సూచనలు చేశారు. గత కొన్నేళ్లుగా తెలంగాణ పోలీసులు తమ వృత్తి పట్ల వ్యవహరించే ప్రొఫెషనలిజం తీరుకు మంచి పేరు ఉందని, అది పోకుండా వెంటనే కాపాడుకోవాలని సూచించారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కొంత మంది పోలీసులను అదుపు చేయాలన్న ఆయన, ప్రభుత్వ పెద్దలను సంతృప్తి పరిచేందుకు కొంతమంది వ్యవహరిస్తున్న తీరు పోలీసుల పేరును పూర్తిగా చెడగొడుతుందని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోస్టు చేయడమే నేరమా :చట్ట వ్యతిరేకంగా వ్యవహరించకుండా పోలీసులు సమయమనం పాటించాలని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో యువత లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై కేటీఆర్, మరో బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తే కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారని వాపోయారు. తొర్రూరు నియోజకవర్గంలో మాలోతు సురేష్ బాబు అనే గిరిజన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని క్రూరంగా హింసించారని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక శాసన సభ్యురాలికి వ్యతిరేకంగా వాట్సాప్‌లో పోస్ట్ చేయడమే ఆయన చేసిన నేరమా అని ప్రశ్నించారు.
ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు : సామాజిక మధ్యమాల్లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును కేటీఆర్ తప్పుబట్టారు. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నించినందుకు మాలోత్ సురేష్ కుమార్ అనే గిరిజనుడిని హింసించడం బాధాకరమన్న మాజీ మంత్రి హరీశ్‌రావు, తొర్రూరు పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ తల్లి ఆవేదనను అర్థం చేసుకోవాలని, ఘటనపై డీజీపీ జితేందర్ విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోకాల్డ్ కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు.