KTR on Telangana Growth by RBI Report :ఒక రాజకీయ నాయకుడు తదుపరి ఎన్నికల గురించి ఆలోచిస్తారని, అదే ఒక రాజనీతిజ్ఞుడు భవిష్యత్ తరం గురించి ఆలోచిస్తారని, ఆ దిశలోనే కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అద్భుత ప్రగతి సాధించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. గడచిన దశాబ్ద కాలంలో కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ తరహా ఫలితాలు చూపగలరా అని ప్రశ్నించారు. దేశంలోనే చిన్న వయసు కలిగిన రాష్ట్రమైన తెలంగాణ పలు కీలక అంశాల్లో ఇతర రాష్ట్రాలను అధిగమించిందని రిజర్వ్ బ్యాంక్ గణాంకాలే ఇందుకు నిదర్శమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా కొన్ని గణాంకాలను ప్రస్తావించారు.
KTR on Congress BJP Government Developments : 2022-23లో రాష్ట్ర తలసరి ఆదాయం 3.08 లక్షల రూపాయలకు చేరిందని, ఇది పెద్ద రాష్ట్రాలన్నింటిలోనూ ఎక్కువ అని కేటీఆర్ తెలిపారు. 2014-15 నుంచి 2021-22 వరకు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 11.6 శాతం వృద్ధిని సాధించిందని, జాతీయ సగటు కేవలం 3.228 శాతం మాత్రమేనని పేర్కొన్నారు. సాగునీటి రంగంలోనూ 2014-15 నుంచి 2020-21 మధ్య తెలంగాణ వృద్ధి 11.6 శాతంగా ఉంటే జాతీయ సగటు 2.108 అని తెలిపారు. 2014-15 నుంచి 2021-22 మధ్య ఏడేళ్ల కాలంలో వార్షిక వృద్ధి రేటు కూడా గణనీయంగా 15.9 శాతం నమోదైందని, జాతీయ సగటు 10.09 శాతంగా ఉన్నట్లు చెప్పారు.