KTR on Compensation for Rain Victims :రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం ఐదు లక్షల రూపాయలే నష్టపరిహారంగా ప్రకటించడం అన్యాయమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు నష్ట పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం అందిస్తామని చెప్పారని ఆయనన్నారు.
ఈ మేరకు గతంలో రేవంత్ రెడ్డి చేసిన ఎక్స్ పోస్ట్‌ను కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారని, ఇచ్చిన మాట నిలబెట్టుకొని రూ. 25 లక్షలు పరిహారం ప్రకటించాలని కోరారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరముందని అన్నారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే అంతకన్నా మోసం మరొకటి ఉండదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ముందస్తు ప్రణాళిక లేకపోవటం వల్లే :వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన, నష్టపోయిన వారికి రూ. రెండున్నర నుంచి ఐదు లక్షల వరకు సాయం చేస్తామన్నారని, ఆ హామీని కూడా నేరవేర్చాలని కేటీఆర్ కోరారు. ప్రభుత్వం అసమర్థత, చేతగాని తనం, ముందస్తు ప్రణాళిక లేకపోవటం కారణంగానే ప్రాణనష్టం జరిగిందని కేటీఆర్ అన్నారు. ఇకనైనా ప్రజల ప్రాణాలు రక్షించేందుకు చర్యలు చేపట్టి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
రాహుల్ జీ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది :చర్యలు తీసుకోవాలని కేవలం సూచించడం మాత్రమే కాదని, విపత్కర సమయంలో ప్రభుత్వం సహాయ చర్యలు వేగవంతం చేసేలా, బాధ్యత తీసుకునేలా చూడాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. వరదల సాయం విషయమై రాహుల్ గాంధీ ఎక్స్ లో చేసిన పోస్ట్‌పై కేటీఆర్ స్పందించారు. రాహుల్ జీ, తెలంగాణ ప్రజల తీర్పు పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం తెలంగాణ విజన్‌ను దెబ్బతీస్తోందని, పార్టీ రోజురోజుకూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణపై నిజంగా శ్రద్ధ ఉంటే అనే సందర్భాల్లో పార్టీ తరపున నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వక హాని జరగదని అన్నారు. ఈ వ్యవస్థీకృత వైఫల్యానికి కాంగ్రెస్‌దే బాధ్యత అని ఆరోపించారు. అద్భుతం కోసం భగవంతుణ్ని ప్రార్థిస్తూ, ప్రజలు తమను తామే రక్షించుకుంటే ఎన్నుకున్న ప్రభుత్వం ఎందుకని రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కేటీఆర్ ప్రశ్నించారు