How to Reduce Belly Fat: ఉరుకుల పరుగుల జీవనశైలి, మానసిక ఒత్తిడి, కేలరీలు అధికంగా ఉండే ఫుడ్ తినడం, హార్మోన్ల మార్పులు తదితర కారణాల వల్ల చాలా మందికి పొట్టకింద కొవ్వు పెరుగుతుంది. దీని వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ చేరి గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతోంది. అంతేకాకుండా అందానికి సైతం ఇది ఇబ్బందే. అందుకే బెల్లీ ఫ్యాట్‌ను కరిగించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు. నచ్చిన ఫుడ్‌కు దూరంగా ఉండటం, వ్యాయామాలు చేయడం చేస్తుంటారు. అయినా ఈ ఫ్యాట్ తగ్గక ఆవేదన చెందుతుంటారు. అయితే కొన్ని సింపుల్ టిప్స్‌ను ఫాలో అయితే బెల్లీ ఫ్యాట్‌ను సులువుగా తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అవేంటే ఇప్పుడు చూద్దాం..
అల్లం టీ: బెల్లీ ఫ్యాట్‌ను కరిగించుకోవాలనుకునేవారు అల్లం టీని తమ డైలీ డైట్‌లో చేర్చుకుంటే మంచిదంటున్నారు. అల్లం శరీర ఉష్ణోగ్రతను పెంచి, మెటబాలిజం రేటును వేగవంతం చేస్తుందని.. దీంతో శరీరం ఎక్కువ కేలరీలను కాల్చి, బరువు తగ్గడానికి దోహదపడుతుందని అంటున్నారు.
బాదం: ప్రతి రోజు ఉదయం నానబెట్టిన బాదం పప్పులను కొన్ని తింటే బెల్లీ ఫ్యాట్ కరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే బాదంలో ఉండే మోనోశ్యాచురేటెడ్ ఫ్యాట్స్ శరీరంలో కొవ్వును కరిగించే శక్తిని పెంచుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయని వివరిస్తున్నారు. అంతేకాకుండా వీటివల్ల శరీరంలో నీరు కూడా పేరుకోకుండా ఉంటుందని అంటున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు చెందిన నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఇదే విషయాన్ని ప్రచురించింది.(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
గ్రీన్ టీ: బెల్లీ ఫ్యాట్‌ను కరిగించడంలో గ్రీన్ టీ కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని అంటున్నారు. గ్రీన్ టీలోని కెఫెన్, కేటెచిన్లు మెటబాలిజం రేటును పెంచి, శరీరం ఎక్కువ కేలరీలను కాల్చేలా చేస్తాయని చెబుతున్నారు. ప్రతి రోజు ఉదయం లేదా రాత్రి సమయంలో ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవాలని సూచిస్తున్నారు.
బ్రౌన్ రైస్: అలాగే రాత్రిపూట వరి అన్నానికి బదులుగా ఓట్స్ లేదా బ్రౌన్ రైస్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయని.. ఇవి మెటబాలిజం రేటును పెంచి, కొవ్వు కరిగించడానికి సహాయపడతాయంటున్నారు.
నీరు: రోజూ నీరు కూడా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. శరీరానికి సరిపడా నీరు అందినప్పుడే టాక్సిన్స్ తొలగిపోయి పొట్టచుట్టూ కొవ్వు కరుగుతుందని అంటున్నారు.
ఫ్రూట్స్: అవకాడో, పైనాపిల్, పుచ్చకాయ, నిమ్మ, క్యారెట్ లాంటి వాటిని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా కూడా పొట్ట కింద కొవ్వును కరిగించుకోవచ్చని చెబుతున్నారు.
వ్యాయామాలు: క్రమం తప్పకుండా ఓ ఇరవై నిమిషాలపాటు వ్యాయామాలు చేయడం ద్వారా కూడా బెల్లీ ఫ్యాట్‌ను కరిగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హై-ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ (HIIT) వ్యాయామాలు చేయడం వల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి ఉపయోగపడుతుందని.. తద్వారా బెల్లీ ఫ్యాట్ కరుగుతుందని నిపుణులు అంటున్నారు. HIIT వ్యాయామాలు పొట్ట చుట్టూ కొవ్వు కరిగేందుకు సహాయపడతాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో ప్రచురితమైంది(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బాణపొట్టతో ఇబ్బందిపడుతున్నారా? - ఈ అలవాట్లు పాటిస్తే మేలు జరుగుతుందంటున్న నిపుణులు!