Organizers Focus On Kodi Pandelu In Sri Potti Sriramulu District : సంక్రాంతి అనగానే పందెం కోళ్లు గుర్తుకొస్తాయి. పండుగ సమీపిస్తున్న తరుణంలో వాటి వేట మొదలైంది. పండుగ రోజు రూ.కోట్లు చేతులు మారుతుంటాయి. బరిలో దిగిన కోడి గెలిస్తే ప్రపంచాన్ని గెలిచిన సంతోషం. అదే ఓడిపోతే తట్టుకోలేని అవమానం. కోడి పుంజు మెడ మీద ఈకలు రెక్కించి, ఒక్క ఉదుటున గాలిలోకి లేచి ప్రత్యర్థిని పడగొట్టే సీన్ పందెం రాయుళ్లకి కావాల్సినంత మజానిస్తుంది. అందుకే వారి పుంజులను బరిలో దింపేందుకు కోళ్లను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం రూ.వేలకు వేలు వెచ్చిస్తున్నారు. ఇప్పుడు కొనుగోలు చేసి కోళ్లకు శిక్షణ, పోషకాహారం ఇచ్చి బరికి సిద్ధం చేయడం అక్కడ అనవాయితీగా వస్తోంది.
తక్కువ ధరకు మేలైన పుంజులు : ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కోడి పందేల మాట ఘనంగా వినిపిస్తోంది. అదే క్రమంలో ఆసక్తి ఉన్నవాళ్లు గ్రామాల్లో తిరుగుతూ మంచిగా ఉన్న పుంజులను కొనుగోలు చేస్తున్నారు. బుచ్చి, సర్వేపల్లి, రాపూరు, కోవూరు, విడవలూరు, ఇందుకూరుపేట, కొడవలూరు, కావలి, ఉదయగిరి, కావలి తదితర ప్రాంతాల్లో సంక్రాంతి సంబురాల్లో భాగంగా కోడి పందెలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కొందరు కొన్ని నెలలకు ముందే శ్రీకాకుళం, ఒంగోలు, తాడేపల్లిగూడెం, గుంటూరు, ఏలూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో తక్కువ ధరకు మేలైన పుంజులను కొనుగోలు చేసి పందేలకు సిద్ధం చేసి విక్రయిస్తున్నారు.
కత్తులు దూసిన కోళ్లు.. పందెంరాయుళ్లకు కాసులు
కోడి ధర రూ.50 వేలు : డేగ, కాకి డేగ, కొక్కిరాయి, నలుపు, తెలుపు నెమళ్లు, అబ్రాస్ తదితర పేర్లతో పిలిచే కోళ్లకు ఈ సమయంలో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఇందులో భాగంగా పందేల నిర్వాహకులు 20 నుంచి 30 వరకు కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల ఒక్కో దాన్ని రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.
పందెం కోళ్లకు నిత్యం ఉడికించిన మటన్, ఉడకబెట్టిన గుడ్లు, రాగులు, సజ్జలు, జీడి పప్పు, బాదం తదితర ఆహారం పెడతారు. బరువు తగ్గకుండా చురుగ్గా పోరాటం చేసేలా ఈ మేతను తినిపిస్తారు. అశ్వగంధ పొడిని పొగరు పెరగడానికి పట్టిస్తారు. బీ కాంప్లెక్స్ మాత్రలు నీటిలో వేసి తాగిస్తారు. వాతం రాకుండా కస్తూరి మాత్రలు తమలపాకులో చుట్టి ఇస్తారు. తాగేందుకు, స్నానానికి వేడి నీటినే వాడుతారు. అలుపు నియంత్రణ కోసం నీళ్లలో వదిలి ఈత కొట్టిస్తారు.
కత్తులు దూసిన కోళ్లు చేతులు మారిన కోట్లు
కత్తి దూసిన పందెం కోళ్లు.. చేతులు మారిన కోట్లు.. లెక్కకురాని ఆంక్షలు