Nose Whiteheads Treatment: మనలో చాలా మందికి ముక్కు మీద గరుకుగా ఏవో తగులుతుంటాయి. ఇంకా కొన్ని చిన్న దద్దుర్లూ వస్తుంటాయి. ఇవి ముక్కు పక్కన కూడా కనిపిస్తుంటాయి. ఇంకా ఎర్రగానూ మారి.. చూడటానికి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. దీంతో వీటిని తగ్గించుకునేందుకు అనేక ప్రయత్నాలు వేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి? ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి? అన్న ప్రశ్నలకు ప్రముఖ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ శైలజ సూరపనేని వివరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం.
మన ముక్కు మీద నూనె గ్రంథులు ఎక్కువగా ఉంటాయని.. రంధ్రాలు కూడా పొడవుగా ఉంటాయని డాక్టర్ శైలజ చెబుతున్నారు. నూనెలు, మృతకణాల కారణంగా ఇవి మూసుకుపోతాయని వివరిస్తున్నారు. ఫలితంగా ఇక్కడ బ్యాక్టీరియా పెరిగి, ఇవి రావడానికి కారణమవుతాయని అంటున్నారు. ఇంకా కొన్నిసార్లు కమొడోజెనిక్, నూనె సంబంధ ఉత్పత్తులు వాడినా వస్తుంటాయని పేర్కొన్నారు. ఇవి తెల్లగా ఉంటే వైట్‌హెడ్స్.. నల్లగా ఉంటే బ్లాక్‌హెడ్స్, యాక్నే అంటుంటారని వివరిస్తున్నారు.
"ముఖ్యంగా మన శరీరంలోని హార్మోనుల్లో అసమతుల్యత, అతిగా నూనెలు విడుదలవడం, పీసీఓఎస్, ఒత్తిడి, ఫ్యామిలీ ప్లానింగ్ ఉత్పత్తులు వాడటం వంటివీ ఇందుకు కారణం అవుతాయి. ఇవి రావొద్దంటే శుభ్రతకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకవేళ బయటికి వెళ్తే... ఇంటికి రాగానే నాన్‌కమొడోజెనిక్ ఉత్పత్తులతో ముఖం క్లీన్ చేసుకోవాలి. వీటిని పోగొట్టుకోవడానికి ఎక్కువగా స్క్రబ్ చేయడం, గిల్లడం, లాగడం లాంటివి చేస్తే సమస్య మరింత పెరుగుతుంది. అందుకోసమే, వారానికి ఒకటీ రెండుసార్లకు మించి స్క్రబ్ చేయొద్దు. రోజుకు రెండుసార్లు గోరువెచ్చని నీళ్లు, మైల్డ్ క్లెన్సర్‌తో ముఖం క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత టోనర్ రాసి, బెంజైల్ పెరాక్సైడ్, సాల్సిలిక్ యాసిడ్, రెటినాయిడ్ క్రీములు రాయాలి. ఇవి మరీ ఎక్కువగా ఉంటే ఓరల్ యాంటీ బయాటిక్స్‌నీ వాడాలి."
--డాక్టర్ శైలజ సూరపనేని, కాస్మెటాలజిస్ట్
వీటితో కూడా ఈ సమస్య తగ్గకపోతే కెమికల్ పీల్స్‌ని ప్రయత్నించొచ్చని డాక్టర్ శైలజ చెబుతున్నారు. ఇంకా కొన్నిసార్లు మనం వాడే హెయిర్ ప్రొడక్ట్స్ కూడా వీటికి కారణం అవుతాయని చెబుతున్నారు. అందుకే వాటిని మన ముఖం మీద పడనీయకుండా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఇంకా ఫోన్ మీద చేరిన దుమ్ము, క్రీముల నూనెలూ వీటికి దారితీస్తాయని వివరిస్తున్నారు. అందుకే ఫోన్‌నీ రోజూ శుభ్రం చేసుకోవాలని.. దిండు గలేబుల్నీ తరచుగా మార్చాలని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
థైరాయిడ్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఇవి తింటే కంట్రోల్ అయ్యే ఛాన్స్!
పిల్లలకు తినేటప్పుడు ఫోన్లు ఇస్తున్నారా? ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?