Heart Care Center In Siddipet : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ మంది గుండెకు సంబంధించిన సమస్యలతోనే మృతి చెందుతున్నారు. గుండె జబ్బులకు చిన్నా పెద్ద తేడాలు లేకుండా అర్థాంతరంగా ఆయుష్షు తీరిపోతుంది. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి పెద్దవారి వరకు గుండెలో అనేక సమస్యలతో అర్థికంగా మానసికంగా వారి బతుకులు చిన్నాభిన్నమవుతున్నాయి. ఈ ఘటనలన్నింటికి పరిష్కార మార్గంగా ఆవిర్భవించిందే శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రి. ఈ ఆస్పత్రిని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్, ఆసుపత్రి ఛైర్మన్ సీ.శ్రీనివాసులు ప్రాంభించారు.
శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రి :సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రిని ఛైర్మన్ సీ శ్రీనివాస్‌తో పాటు మాజీ క్రికెటర్, ఆసుపత్రి ట్రస్టీ సునీల్ గవాస్కర్ ప్రారంభించారు. చిన్నారులను గుండె జబ్బుల నుంచి రక్షించడమే లక్ష్యంగా ఈ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. తొలుత సత్యసాయి నిలయంలో సత్యసాయి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణాన్ని గవాస్కర్ పరిశీలించారు. ఆసుపత్రిలో చిన్నారులకు అందించే వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడి వార్డులను పరిశీలించారు. గుండె శస్త్రచికిత్సలు చేయడానికి అధునాతన వైద్య పరికరాలను శ్రీ సత్యసాయి సంజీవిని సెంటర్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
దిల్ మాత్రమే ఉంటుంది బిల్ ఉండదు : క్రికెట్లో గెలవడానికి రెండో ఛాన్స్ ఉంటుందికానీ, జీవితంలో రెండో ఛాన్స్ అనే అవకాశం ఉండదని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి సంజీవని చిన్నపిల్లల ఆసుపత్రిని ప్రారంభించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. సంజీవని చిన్న పిల్లల ఆసుపత్రిలో కేవలం దిల్ మాత్రమే ఉంటుందని, బిల్ ఉండదని స్పష్టం చేశారు. వైద్య సేవలు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. క్రికెట్లో 200 స్కోర్ చేసినప్పుడు కూడా లభించని ఆనందం వారి తల్లిదండ్రులు ముఖాల్లో చూస్తామన్నారు.
పిల్లలు ఇక్కడి నుంచి వెళ్లాక మరో జన్మ ఎత్తినట్లు అవుతుంది. ఇందులో భాగస్వామ్యం అయ్యేందుకు నాకు మంచి అవకాశం వచ్చింది. ఎందుకు భాగస్వామ్యం అయ్యానంటే ఇంకో జన్మ ఎత్తిన పిల్లలు గుర్తుకు వచ్చినప్పుడు నా టెస్ట్ కెరీర్ ప్రారంభంలో తిరిగి పుంజుకున్న విషయాలు గుర్తుకు వస్తాయి. కెరీర్ ప్రారంభంలో రెండు సార్లు ఔట్ కాకుండా బయటపడ్డా. అందుకనే ఈ అవకాశం నాకు రాగానే రెండు చేతుల్తో అంది పుచ్చుకున్నా. ఏ పిల్లలు అయితే అనారోగ్యానికి గురై ఇబ్బందిపడతారో వారికి నయం చేసి మరో జన్మ ఇవ్వడం చాలా బాగుంటుంది.