Forest around Outer Ring Road in Hyderabad :నగరంలో నిత్యం రణగొణ ధ్వని, కాలుష్యంతో సతమతమవుతున్న వేళ వీటికి దూరంగా ఉండి ప్రకృతి ఒడిలో కాసేపు సేదతీరేలా అవుటర్ చుట్టూ అటవీ శాఖ, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో పలు పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని అందుబాటులోకి రాగా మరికొన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇలా ఓఆర్‌ఆర్ లోపల, బయట ఫారెస్టు బ్లాకులగా చేసి అభివృద్ధి చేస్తున్నారు. అందులోనే పలు సౌకర్యాలతో పార్కులగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రకృతిలో కాసేపు గడిపేలా ఏర్పాటు చేశారు.
అరుదైన జాతుల వృక్షాలతో అటవీ పార్కు
నగరంలోని తుక్కుగూడ ఎగ్జిట్ నంబరు 14 వద్ద సుమారు 526 హెక్టార్ల విస్తీర్ణంలో శ్రీనగర్ అటవీ పార్కు ఉంది. పర్యాటకులకు కావాల్సిన వసతులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఓఆర్‌ఆర్ నుంచి 12 కిలోమీటర్ల తర్వాత ఈ అటవీ పార్కు ఉంటుంది. దీనికి కోసం హెచ్‌ఎండీఏ దాదాపు రూ.8 కోట్లు వెచ్చించగా అక్కడ అరుదైన జాతుల వృక్షాలు చూడవచ్చు.
కుటుంబాలతో సరదాగా గడిపేలా
అవుటర్ చెంతనే కొత్వాల్‌గూడ వద్ద ఎకో పార్కు పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. అక్కడ మొక్కల పెంపకం, పక్షుల పార్కు, పచ్చిక బయళ్లు వాక్‌వే సిద్ధమైంది. ఈ నెలాఖరులోపు ఇది అందుబాటులో రానుంది. అంతేకాకుండా రెండో దశలో వివిధ రకాల జాతులతో కూడిన చేపల అక్వేరియం, రాత్రి సమయంలో కుటుంబాలతో సరదాగా అడవిలోనే గడిపేందుకు ప్రత్యేక కాటేజీలు నిర్మించనున్నారు.
ఆహ్లాదాన్ని పంచే మన్యంకంచ
కందుకూర్ మండలం లేమూర్‌లో 58.78 హెక్టార్లలో మన్యంకంచ పార్కు రూపుదిద్దుకుంది. ఈ పార్కులో మౌలిక వసతుల కోసం సుమారు రూ.4.49 కోట్లు ఖర్చు పెట్టారు. ఓఆర్‌ఆర్ తుక్కుగూడ ఎగ్జిట్ 14 నంచి ఈ పార్కుకు చేరుకోవచ్చు.