Bar License Application in Andhra Pradesh : ఏపీ వ్యాప్తంగా 53 బార్ లైసెన్సుల జారీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏడాది కాలపరిమితితో ఉన్న లైసెన్సులకు నోటిఫికేషన్‌ను అబ్కారీ శాఖ ఇచ్చినట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు. ఈ బార్ లైసెన్స్ 2024 డిసెంబరు 1 నుంచి 2025 ఆగష్టు 31వ తేదీ వరకు ఉండనుంది.
ఈ-వేలం, ఆన్లైన్ లాటరీ విధానంలో బార్లను ఎక్సైజ్ శాఖ కేటాయించనుంది. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమై 22తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియనుంది. 50 వేల జనాభా వరకూ రూ.5 లక్షల నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుము చెల్లించాలి. 50 వేల నుంచి 5 లక్షల లోపు జనాభా వరకూ ఉన్న ప్రాంతాలకు రూ.7.5 లక్షల దరఖాస్తు రుసుము ఇవ్వాలి. అదే 5 లక్షల పైచిలుకు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.10 లక్షల దరఖాస్తు రుసుముగా నిర్ధారించారు.
దరఖాస్తు వివరాలు :
- డిసెంబరు 16వ తేదీ నుంచి డిసెంబరు 22 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ
- 50 వేల జనాభా వరకూ ఉంటే రూ.5 లక్షలు నాన్ రిఫండబుల్ రుసుము
- 50 వేల నుంచి 5 లక్షల లోపు జనాభా ఉంటే రూ.7.5 లక్షల దరఖాస్తు రుసుము
- 5 లక్షల పైచిలుకు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.10 లక్షల దరఖాస్తు రుసుము
తగ్గిన ప్రముఖ బ్రాండ్ల మద్యం ధరలు : గత నెలలో ఏపీ ప్రభుత్వం మందు బాబులకు మూడు మద్యం బాటిల్స్ క్వార్టర్స్‌పై ఏకంగా రూ.50 లు తగ్గించిన విషయం తెలిసిందే. ఏపీలోని మూడు ప్రముఖ మద్యం కంపెనీలు మద్యం ధరలను తగ్గించడానికి ముందుకు రాగా.. వెంటనే ఏపీ ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఆ వెంటనే తగ్గించిన రేట్లు అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు అక్కడ క్వార్టర్‌పై ఆ మద్యం రూ.50 లు తగ్గింది. అందులో రాయల్ చాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ, మాన్షన్ హౌస్, యాంటీక్విటీ విస్కీ ఫుల్ బాటిల్ ధరలు తగ్గాయి. రాయల్ చాలెంజ్ క్వార్టర్ ధర రూ.230 ఉంటే ఇప్పుడు అది రూ.210లకు వస్తోంది. అదే ఫుల్ అయితే రూ.920 నుంచి రూ.840 తగ్గింది. అలాగే మాన్షన్ హౌస్ క్వార్టర్ రూ.220 నుంచి రూ.190కు వస్తోంది. అదే ఫుల్ బాటిల్ అయితే రూ.760 తగ్గింది. యాంటీక్విటీ విస్కీ పుల్ రూ.1400కు వస్తోంది.