Telangana Style Chukkakura Pachadi Recipe : ఆకుకూరలు అనగానే మనలో చాలా మందికి పాలకూర, తోటకూర, గోంగూర వంటివి ముందుగా గుర్తొస్తాయి. వాటితోనే రకరకాల వంటకాలు ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, అవి మాత్రమే కాదు పోషకాలు పుష్కలంగా ఉండే చుక్కకూరతోనూ అద్దిరిపోయే రెసిపీలు తయారు చేసుకోవచ్చు. అలాంటి వాటిల్లో ఒకటి.. తెలంగాణ స్టైల్ "చుక్కకూర పచ్చడి". ఈ స్టైల్లో ఒక్కసారి చట్నీని చేసుకుని తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు! గోంగూర పచ్చడిని మించిన టేస్ట్‌తో భలే నోరూరిస్తుంది ఈ పచ్చడి. పైగా దీన్ని చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- చుక్కకూర ఆకులు - 100 గ్రాములు
- పల్లీలు - 3 టేబుల్‌స్పూన్లు
- జీలకర్ర - 1 టేబుల్‌స్పూన్
- నూనె - 1 టేబుల్‌స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 6
- పచ్చిమిర్చి - 8
- ఉప్పు - రుచికి సరిపడా
తాలింపు కోసం :
- నూనె - 1 టేబుల్‌స్పూన్
- ఆవాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- శనగపప్పు - 1 టేబుల్‌స్పూన్
- మినప్పప్పు - 1 టీస్పూన్
- ఎండుమిర్చి - 2
- కరివేపాకు - 1 రెబ్బ
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా చుక్కకూర ఆకులను తుంచుకుని ఒక బౌల్లో వేసి శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై చిన్న కడాయి పెట్టుకొని పల్లీలు వేసి వేయించుకోవాలి. అవి కాస్త వేగాక జీలకర్ర కూడా వేసుకొని కాసేపు వేయించి దింపేసుకోవాలి. ఆపై అవి చల్లారక మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం అదే కడాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మిర్చి కాస్త మగ్గేంత వరకు వేయించుకోవాలి.
- ఆ తర్వాత అందులో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చుక్కకూరను వేసుకొని పచ్చివాసన పోయి మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఆపై స్టౌ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి.
- అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో మెత్తగా ఉడికించుకున్న చుక్కకూర మిశ్రమం, ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి, ఉప్పు వేసుకొని మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి.
- ఇప్పుడు పచ్చడికి తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి.
- అవి వేగిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని తాలింపుని చక్కగా వేయించుకోవాలి.
- తర్వాత ఈ తాలింపుని ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిలో వేసుకొని కలిపేసుకుంటే చాలు. ఒకవేళ మీకు పచ్చడి పుల్లగా కావాలంటే ఒక చిన్న రెబ్బ చింతపండు వేసుకోవచ్చు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే తెలంగాణ స్పెషల్ "చుక్కకూర పచ్చడి" రెడీ!
- దీనిని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే కలిగే ఫీలింగ్ అద్భుతంగా ఉంటుంది. మరి, నచ్చితే మీరూ ఓసారి ఈ పచ్చడిని ట్రై చేయండి. చిన్నా, పెద్దా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు!
ఇవీ చదవండి :
వెడ్డింగ్ స్టైల్ కమ్మని "దోసకాయ పచ్చడి" - వేడి వేడి అన్నంలోకి అద్దిరిపోతుంది - ఓసారి ట్రై చేయండి!
ఈ స్టైల్లో ఒక్కసారి "టమాటా పచ్చడి" చేసుకోండి - ఔర్ ఏక్ ప్లేట్ ఇడ్లీ/దోశ మమ్మీ అని అడగడం పక్కా!