Heavy Rains in Andhra Pradesh : రానున్న రెండు రోజుల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ప్రస్తుతం అల్పపీడన ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉందంది.
భారీ నుంచి అతి భారీవర్షాలు వర్షాలు : విజయనగరం, విశాఖపట్టణం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో రైతులను అప్రమత్తం చేశారు.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు : శ్రీకాకుళం, పార్వతీపుర మన్యం, అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది. ఈనెల 19 తేదీన పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా మరియు నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
ఆ జిల్లాల్లో చలి పంజా : మరోవైపు తెలంగాణలోనూ ఉష్టోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ శీతల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగ మంచు ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొంది.
ఎల్లుండి వర్ష సూచన : బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం - రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు