Students Food Poison in Ambedkar Gurukulam at Naidupeta :ఆంధ్రప్రదేశ్తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అంబేడ్కర్ గురుకులంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 100 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు రోజుల కిందట వండిన ఆహార పదార్థాలను ఆదివారం మధ్యాహ్నం భోజనంలో వడ్డించడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని తోటి విద్యార్థులు పేర్కొన్నారు.
అస్వస్థతకు గురైన విద్యార్థులను గురుకుల సిబ్బంది హుటాహుటిన నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి కలుషిత ఆహారం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వెల్లడించారు. ఇందులో 50 మంది పిల్లలు తీవ్ర, మరో 50 మంది స్వల్ప అనారోగ్యం పాలయ్యారు. కొంత మంది విద్యార్థులను మెరుగైన చికిత్స నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, స్పందించారు.
అస్వస్థకు గురైన విద్యార్థుల ఆరోగ్యంపై మంత్రి ఆరా : గురుకుల విద్యార్థుల అస్వస్థతపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పందించారు. అక్కడి వైద్య అధికారులతో మాట్లాడి వైద్యం అందుతున్న వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.