Army Mobilized For Budameru Canal Works in NTR District : ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి - కవులూరు వద్ద బుడమేరు గండి పూడ్చేందుకు ఆర్మీ కార్యరంగంలోకి దిగింది. దీంతో అవసరమైన అన్నిరకాల పరికరాలతో ఆర్మీ కార్యక్షేత్రానికి వచ్చింది. ఇప్పటికే జరుగుతున్న పనులకు ఆర్మీ తమ వంతు సహకారం అందించనుంది. బుడమేరు వద్ద జరుగుతున్న పనులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడితో ఆర్మీ అధికారులు మాట్లాడారు.
బుడమేరు కట్ట చివరి నుంచి మూడో గండి పడిన ప్రాంతం వరకు ఆర్మీ క్షుణ్నంగా పరిశీలించింది. ఈ ఆపరేషన్‌కు గానూ 6వ మద్రాస్ రెజిమెంట్ నుంచి 120 మంది అధికారులు, ఆర్మీ జవాన్లు వచ్చారు. మరికొద్ది సేపట్లో మిలిటరీ ఆధ్వర్యంలో గండి పూడ్చే కార్యక్రమం చేపట్టేందుకు ప్రయత్నాలు చేయనున్నట్లు తెలుస్తోంది. తాత్కాలికంగా ఇనుప రాడ్డులతో వంతెనల్లాగా నిర్మాణం చేసి దాంట్లో రాళ్లు వేసి పూడుస్తామని మిలిటరీ అధికారులు తెలిపారు.
CM Chandrababu Teleconference With Ministers On Flood Relief Measures :ఆంధ్రప్రదేశ్ వరద సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను అధికారులు సీఎంకు వివరించారు. అగ్నిమాపక వాహనాలతో రోడ్లు, కాలనీలు, ఇళ్ల క్లీనింగ్‌ను మరింత వేగవంతం చేయాలని సూచించారు. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత పనుల పురోగతిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. బుడమేరు కాలువ గండ్లు పూడ్చేందుకు ఆర్మీ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నట్లు అధికారులు వివరించారు.
బుడమేరుపై సైనిక బలగాలు : గండ్లు పూడ్చివేత కార్యక్రమంలో భారత ఆర్మీకి చెందిన ఇంజినీరింగ్ టాస్క్‌ఫోర్స్ విభాగం రంగంలోకి దిగినట్లు తెలిపారు. యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టి ఇప్పటికే అధికారులు రెండు గండ్లు పూడ్చారన్నారు. కాగా అత్యంత క్లిష్టంగా ఉన్న మూడో గండి పూడ్చివేత పనులను ఆర్మీ అధికారుల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పూర్తి చేయనుంది. అన్ని విభాగాల సమన్వయంతో మూడో గండి పూడ్చివేత పనులు త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.