తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం - 51.4 అడుగులకు చేరిన నీటిమట్టం - కాసేపట్లో మూడో వార్నింగ్ - BHADRACHALAM GODAVARI FLOODS UPDATE

Godavari Water Level At Bhadrachalam Today : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే వరద ఉద్ధృతి రెండో ప్రమాద హెచ్చరికను దాటింది. మూడో ప్రమాద హెచ్చరిక వైపు దూసుకెళ్లడం తీర ప్రాంతాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలో వాగులు, వంకలు పొంగి మండల కేంద్రాలతో రాకపోకలు నిలిచిపోయాయి.

Rising Godavari Floods at Bhadrachalam
Rising Godavari Floods at Bhadrachalam (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 23, 2024, 7:06 AM IST

Updated : Jul 23, 2024, 8:29 AM IST

Godavari Flood Water Rising at Bhadrachalam : భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. రాత్రి 10 గంటలకు 50 అడుగులు దాటింది. మంగళవారం ఉదయం 51.4 అడుగులకు చేరుకుంది. దాదాపు 12 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు ఉరకలెత్తుతోంది. వరద ముంచెత్తడంతో భక్తుల తలనీలాలు సమర్పించే కల్యాణ కట్టను మూసేశారు. స్నానఘట్టాలు కిందిభాగం, విద్యుత్తు స్తంభాలు మునిగాయి. కాళేశ్వరం, ఇంద్రావతి వైపు నుంచి పేరూరు మీదుగా భద్రాచలం వైపు వరద పోటెత్తడంతో ప్రతీ గంటకూ నీటి మట్టం పెరుగుతూ వస్తోంది.

గోదావరి నీటి మట్టం క్రమంగా పెగుతున్నందున ముంపు ప్రాంతాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్మగూడెం మండలంలోని సున్నంబట్టి, బైరాగులపాడు గ్రామల మధ్య రాకపోకలు నిలిచాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో చర్ల మండలంలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండల కేంద్రంతో 7 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. విలీన మండలాలతో భద్రాచలం పట్టణానికి రాకపోకలు నిలిచిపోయాయి.

అధికారులు బాధితులతో కలిసి భోజనం చేయండి : భద్రాచలం వద్ద గోదావరి వరద తీవ్రత, ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలంలో పర్యటించారు. నూతనంగా నిర్మిస్తున్న కరకట్ట, విస్టా కాంప్లెక్స్, కరకట్ట స్లూయీజ్‌లను పరిశీలించారు. గోదావరి వరద ప్రవాహం, నీటి మట్టం వివరాలను అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

నీటిమట్టం 55 అడుగుల వరకు చేరుకునే వీలు ఉన్నందున ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఉన్న ప్రభుత్వం వరద బాధితులకు కనీస వసతులు ఏర్పాటు చేయలేదన్న అపవాదు ఎదుర్కొందని కానీ, ఈ సారి అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చూడాలన్నారు. ఇంఛార్జీలుగా ఉన్న అధికారులు పునరావస కేంద్రాల్లోనే బాధితులతో కలిసి భోజనం చేయాలని సూచించారు.

"సెప్టెంబరు మొదటి వారం వరకు ఈ వరదలు ఇలానే గోదావరికి ఉంటాయి. అందుకే అందరూ అలర్ట్​గా ఉండాలి. గతంలో ఉన్న పరిస్థితులు ఉత్పన్నం కాకూడదు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి. ఇంఛార్జీలుగా ఉన్న అధికారులు పునరావాస కేంద్రాల్లోనే బాధితులతో కలిసి భోజనం చేయాలి." -పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : వరద సహాయక చర్యలు, విధుల్లో అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం వహించినట్లు ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ హెచ్చరించారు. వరద తీవ్రత పెరుగుతున్నందున పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్​ఎఫ్ సిబ్బంది, రోడ్లపైకి వరద చేరిన ప్రాంతాలో పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నామని ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు.

రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాలు - వరదనీటిలో మునిగిన పంటలు - Rains Effects In Telangana

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు - ఊళ్లు, పొలాలను ముంచెత్తుతున్న వరద - Rain In AP

Last Updated : Jul 23, 2024, 8:29 AM IST

ABOUT THE AUTHOR

...view details