Five Accused Arrested in Women Gang Rape Case Satyasai District : ఆడవారిపై అత్యాచార ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచార ఘటన విచారణలో పోలీసులు పురోగతి సాధించారు. దోపిడీలు, హత్యాచారాలకు పాల్పడడం అలవాటుగా మారిన వ్యక్తులే వలస కూలీలపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులు నాగేంద్ర, ప్రవీణ్‌తోపాటు మరో ముగ్గురు మైనర్లను అరెస్టు చేసినట్లు సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. రెండ్రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీ వాచ్‌మెన్ ఇంట్లోకి ప్రవేశించి అత్తా కోడళ్లపై గ్యాంగ్ రేప్ చేసి, ఇంట్లో ఉన్న 5 వేల 200 రూపాయల నగదును దోచుకెళ్లినట్లు వివరించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు.
చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామంలో శనివారం అత్త, కోడలిపై సామూహిక అత్యాచారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉపాధి నిమిత్తం గ్రామానికి వచ్చారు. ఓ నిర్మాణం వద్ద వారంతా వాచ్‌మెన్, తదితర విధులను నిర్వర్తిస్తున్నారు. ఈక్రమంలో శనివారం తెల్లవారుజామున నలుగురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాల్లో వచ్చారు. నిర్మాణం వద్ద నివాసం ఉంటున్న అత్త, కోడలిని కత్తులతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన తండ్రీ, కుమారుడిని బెదిరించారు. ఈ ఘటనపై బాధితులు చిలమత్తూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు విచారణ చేపట్టి తాజాగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం - పోలీసుల అదుపులో నిందితులు