Fire accident in herbal Company : రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద అలెన్ హెర్బల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. హెర్బల్ కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఏసీలు ఒక్కసారిగా పేలడంతో మంటల తీవ్రత పెరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో దాదాపు 50 మంది కార్మికులు ఉన్నారు. దీంతో భయాందోళనకు గురైన పలువురు కార్మికులు కిటికీల్లోంచి దూకి తప్పించుకున్నారు.
వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనం పై అంతస్థులో చిక్కుకున్న కార్మికులందరిని నిచ్చెన ద్వారా సురక్షితంగా బయటకు తరలించారు. ఒక కార్మికుడిని తరలించే లోపే మంటల ధాటికి భయపడి కిటికీలోంచి కిందకు దూకడంతో గాయాలయ్యాయి. అతనికి చికిత్స నిమిత్తం షాద్నగర్ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి వెంటనే డీఆర్డీఎల్ హాస్పిటల్కు తరలించారు. ఘటనా స్థలానికి డీసీపీ నారాయణరెడ్డి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదంలో ప్రాణనష్టం ఏం జరగలేదని డీసీపీ తెలిపారు. ఆస్తినష్టం గురించి విచారణ జరుపుతున్నామని తెలిపారు.
'నందిగామ గ్రామంలో 2 ఎకరాల్లో అలెన్ హెర్బల్ పరిశ్రమ ఉంది. ఇక్కడ దాదాపు 70 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో పరిశ్రమలో వెల్డింగ్ వర్క్ చేస్తుండగా దాని నుంచి నిప్పులు థర్మకోల్ రబ్బర్ ప్రొడక్ట్స్ మీద పడింది. దీని వల్ల మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదం జరిగింది. ముగ్గురు లోపల చిక్కుకున్నారు. వాళ్లను కూడా కాపాడాం. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు'- నారాయణరెడ్డి, డీసీపీ