Finland Woman Raita Mocherla Success Story :అనగనగా ఓ ఫిన్లాండ్ అమ్మాయి, ఓ హైదరాబాద్ అబ్బాయి. యాహూ చాట్‌లో పరిచయం. ఒకరినొకరు చూసుకోలేదు. కానీ ప్రేమలో పడ్డారు. ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. అసలు కథ అప్పుడే స్టార్టయింది. ఆ అమ్మాయి సంప్రదాయాన్ని పాటిస్తూ అత్తవారింట అడుగుపెట్టడమే కాదు, తేట తెలుగులో అనర్గళంగా మాట్లాడేస్తోంది. అంతేనా భారతదేశం మీద ప్రేమను పెంచుకుని పర్యావరణహిత టాయిలెట్స్‌తో వ్యాపారవేత్తగానూ రాణిస్తోంది రైతా మోచెర్ల. మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
Finland Raita Mocherla Pradeep Love Story :మాది ఫిన్లాండ్‌లో ఓ మధ్య తరగతి కుటుంబం. పాఠశాలల్లో వివిధ భాషలు నేర్చుకునే అవకాశం ఉండటంతో ఇంగ్లీష్, స్వీడిష్, రష్యన్, జర్మన్ నేర్చుకోగలిగాను. ఇంగ్లీష్‌పై పట్టుసాధించడం కోసం యాహూ చాటింగ్‌లోకి వెళ్లాను. అప్పుడు 1997లో ప్రదీప్ పరిచయం అయ్యాడు. చాట్‌లో తన మాతృ భాష తెలుగు అని చెబితే, తొలిసారిగా విన్న తెలుగు భాషను నేర్చుకోవాలనిపించింది. మా యూనివర్శిటీ ప్రొఫెసర్‌కి ఈ విషయం చెప్పా. 1960లో ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన ఒకాయన ఫిన్లాండ్‌లో తెలుగు సబ్జెక్టుపై కోర్సు చెప్పారని, దానికి సంబంధించి గంద్రాలయంలో ఉన్న 2 బుక్స్‌ను తెచ్చి ఇచ్చారు. దీంతో తెలుగు నేర్చుకున్నా.
మా అమ్మా నాన్న భయపడ్డారు :ప్రదీప్‌తో పరిచయం నాలుగు సంవత్సరాల్లో ప్రేమగా మారింది. అప్పటి వరకు మేం ఒకరినొకరు చూసుకోలేదు. ఇద్దరం కూడా చదువుకుంటున్నాం. ఓసారి ప్రదీప్ నన్ను చూడటానికి ఫిన్‌లాండ్‌కు వద్దామనుకున్నాడు. ప్రేమించిన అమ్మాయిని చూడటానికి ఫిన్‌లాండ్‌కు వెళ్తున్నానని తను చెప్పడంతో వీసా రాలేదు. నేను భారతదేశం వద్దామంటే మా ఇంట్లో ఒప్పుకోలేదు. ఆ తరువాత ప్రదీప్ మాస్టర్స్ చేయడానికి లండన్ వస్తే, నేను చూడటానికి వెళ్లా. తను నాకో పసుపు రంగు సల్వార్ కమీజ్‌ను కొరియర్‌లో పంపారు, దాన్ని నేను ధరించి విమానాశ్రయంలో దిగాను. అలా తను నన్ను గుర్తు పట్టారు.
అక్కడ మొదటిసారి అలా కలుసుకున్నాం. ఆ దుస్తులను ఇప్పటి వరకూ భద్రంగా దాచుకున్నాను. తరువాత లండన్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్ చేశా. ఇద్దరం అక్కడే వివాహం చేసుకున్నాం. 2005లో ఫిన్లాండ్, భారత్‌ల్లో ఆయా సంప్రదాయాల మేరకు మరో రెండు సార్లు మాకు పెళ్లి అయ్యింది. ఇక్కడి సంప్రదాయాలు ఎలా ఉంటాయోనని మా అమ్మా నాన్న భయపడ్డారు. అయితే హైదరాబాద్ వచ్చి ఇక్కడి సంస్కృతి, అందరూ నా పట్ల చూపించే మర్యాద అమ్మా నాన్నకు నచ్చింది. క్రమంగా తెలుగు, హిందీ భాషల్లో నైపుణ్యం పెంచుకున్నాను. మాకు నలుగురు పిల్లలు ఉన్నారు.
ప్రపంచ వ్యాప్తం చేయాలనేది లక్ష్యం :మేడ్చల్‌లో ఇనుము, సిమెంట్‌తో కాకుండా రాళ్లు, మట్టితో పర్యావరణహితంగా ఇంటిని నిర్మించుకున్నాము. 6 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేసి హైదరాబాద్ నగరవాసులకు ఆకుకూరలు, కూరగాయలను పది సంవత్సరాల పాటు పంపిణీ చేశాం. ఆ తరువాత మరుగు దొడ్ల నుంచి వచ్చే వ్యర్థ జలాలను పునర్వినియోగించేలా సూయిజ్ ట్రీట్‌మెంట్ సిస్టమ్ ప్రాజెక్టును మొదలుపెట్టాం. పలు పరిశోధనల తరువాత మా తోటలో ఆక్వాట్రాన్‌ని ఇన్‌స్టాల్ చేసి విజయవంతం అయ్యాం. బయో కంపోస్టింగ్ టాయిలెట్ విధానంతో వృథా జలాన్ని సేకరించి వ్యవసాయం, తోట, రీఫ్లషింగ్ వంటి వాటికి ఉపయోగిస్తున్నాం. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన స్వచ్ఛ భారత్ హ్యాకథాన్-2017 పోటీలో మా ప్రాజెక్టు విజేతగా నిలిచింది. రూ.3 లక్షలు నగదు బహుమతినీ అందుకుంది.
ప్రస్తుతం తెలంగాణ, ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా సన్ ఫార్మా, అపోలో వంటి పలు ప్రైవేటు సంస్థలతో పాటు లద్దాఖ్‌లోని ఇండియన్ ఆర్మీకి ఈ ప్రాజెక్టును ఇన్‌స్టాల్ చేశాం. దీన్ని ప్రపంచ వ్యాప్తం చేయాలనేది లక్ష్యం. 30 మందికి పైగా సిబ్బందికి ఉపాధిని ఇస్తున్నాం. త్వరలో ఇండియన్ మైథాలజీ థీమ్‌తో ఒక ప్రత్యేక పార్కు ఏర్పాటు చేయబోతున్నాం. ఇది స్పెషల్ చిల్డ్రన్ సహా అన్ని వయసుల వారికీ ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇతర దేశం నుంచి వచ్చినా ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. అందుకే ఇవన్నీ ఇష్టంగా చేయగలుగుతున్నాను.
YUVA: 20 బైక్‌లతో మొదలై 2 వేల ఈవీ వాహనాల వ్యాపారం - అంకుర సంస్థ అద్భుతం